శ్రీశైల క్షేత్రంలో దుకాణాల కేటాయింపు పెద్ద దుమారానికి దారి తీస్తుంది. ఇతర మతస్తులకు దుకాణాలను ఎలా కేటాయిస్తున్నారంటూ, స్థానిక బీజేపీ నేతలు వేలం పాటకు అడ్డు పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పవిత్రమైన శైవక్షేత్రంలో అన్యమతస్తులకు ఎలా దుకాణాలూ అప్పజెప్పుతారంటూ స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ నేతలకు వారి వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒకరినొకరు తోసుకోవడం వివాదాన్ని పెద్దది చేసింది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ వివాదంపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


ఇతర మతస్తులకు దుకాణాలు ఎలా కేటాయిస్తారంటూ మండిపడుతున్నారు. వెంటనే దుకాణాల కేటాయింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలంలో దుమారంపై ఆందోళనకు సిద్ధమయ్యారు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్. వెంటనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్న రాజా సింగ్ మంగళవారం శ్రీశైలంలో ధర్నాకు దిగుతానని చెబుతున్నారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు రాజాసింగ్.


దీనిపై రాజాసింగ్ మాట్లాడుతూ, 'శ్రీ శైలం ఒక పుణ్యక్షేత్రం. అదే పుణ్యక్షేత్రంలో గుడి ముందు దాదాపు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై షాపులు అక్కడ పెడతారు. అంటే ఎవరైనా తీర్ధస్థానానికి వెళితే, గుడికి వెళితే ఏదైన కొనటానికి కాని, ఏదైనా ఫోటోస్ కొనటానికి కాని, పూలు కొనటానికి కాని, కొబ్బరికాయలు కొనటానికి అక్కడ మొత్తం షాపులుంటాయి. కానీ అక్కడ  కొంతంమంది లోకల్ ఎండో మెంట్ అధికారులు ఒక వర్గానికి చెందిన వాళ్ళకే ఆ షాపులు ఇస్తున్నారని ఒక వార్తలు వస్తున్నాయి. రేపు 11 గంటల వరకు ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు శ్రీ శైలం గుడికి చేరుతున్నారు. ఒక ధర్నా కార్యక్రమం పెట్టారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న ఎక్కువ శాతం, ఎక్కువ సంఖ్యలో శ్రీశైలం చుట్టుపక్కల  ఊళ్లలో గాని, మన డిండి గాని, అచ్చంపేట గాని చుట్టుపక్క ఊరు వాళ్ళు అందరూ ధర్నా కార్యక్రమానికి వెళ్ళి ఆ ప్రోగ్రాంన్ని సఫలీకృతం చేయాలని అందరినీ కోరుతున్నాను.' అని ఆయన అన్నారు. అయితే రేపు ఈ విషయం పై ధర్నాలు గాని ర్యాలీలు గాని జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీశైలం ఈఒ, డీఎస్పీ వెంకట్రావు ప్రెస్స్ మీట్ లో వివరణ ఇచ్చారు. దీంతో రేపు ఏం జరగబోతోంది అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: