ఏపీలో యువ సీఎం జ‌గ‌న్ పాల‌న ఎలా ఉంది?  75 రోజులు వైసీపీ పాల‌న‌పై పెద్ద ఎత్తున సాగుతున్న చ‌ర్చ‌. అది కూడా ఏపీలో అయితే కాదు! పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిసాల్లో!! కొంత ఆశ్చ‌ర్యంగానే అనిపించినా.. తెలంగాణలోని విప‌క్షాల నుంచి కూడా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. తొలి నెల‌లోనే కాంప్లిమెంట్లు అందుకున్నారు. అందునా.. వైఎస్ అంటే వ్య‌తిరేకించిన వీహెచ్ హ‌నుమంత‌రావు వంటి వారి నుంచే జ‌గ‌న్ అభినంద‌న‌లు అందుకున్నారు. నేను ఏపీ నాయ‌కుడినైతే.. ఖ‌చ్చితంగా జ‌గ‌న్‌ను స‌త్క‌రించేవాడిని! అంటూ ఆయ‌న గాంధీ భ‌వ‌న్ సాక్షిగానే ఆయ‌న చెప్పారు. ఇక‌, భ‌ట్టి విక్ర‌మార్క‌వంటి వారు సైతం జ‌గ‌న్ పాల‌న‌కు మంచి మార్కులు వేశారు. 


అదేస‌మ‌యంలో కాంగ్రెస్ తెలంగాణ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా జ‌గ‌న్‌ను విమ‌ర్శించేటందుకు ఏముంది? అంటూ మీడియాతో నే అన్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. రోజుకో క‌య్యం పెట్టుకునే తెలంగాణ సార‌ధి కేసీఆర్ ఏకంగా ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. ఏపీకి వ‌చ్చి పోతున్నారు. జ‌గ‌న్ పాల‌న‌ను చూసి మెచ్చుకుంటూనే ఉన్నారు. తాను పెద్ద‌న్న‌లా సాయం చేస్తాన‌ని చెబుతున్నారు. ఇక‌, ఇవ‌న్నీ ఇలా ఉంటే.. త‌మ దారి త‌మ‌దేన‌ని నొక్కి వ‌క్కాణించే త‌మిళులు కూడా ఏపీ పాల‌న‌పై ఎలాంటి భేష‌జాలు లేకుండా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 


అధికార‌ప‌క్షం అన్నాడీఎంకే, ప్ర‌తిప‌క్షం డీఎంకేలు సైతం ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతూ.. జ‌గ‌న్ పాల‌నను మెచ్చుకుంటున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప్రశంస జాబితాలో తాజాగా ఒడిసా సీఎం న‌వీన్ కూడా చేరిపోయారు. అవినీతి లేని పాల‌న‌పై తాజాగా ఆయ‌న అక్క‌డి అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ఏపీ సీఎం అనుస‌రిస్తున్న విధానాల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎస్‌కు సూచించారు. అదేస‌మ‌యంలో గ్రామాల్లో పాల‌న‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసేందుకు ఏపీలో అనుస‌రిస్తున్న గ్రామ వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త్వ‌ర‌లోనే ఒడిసాలోనూ ఏర్పాటు చేయాల‌ని సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నిర్ణ‌యించారు. 


దీనికి సంబంధించిన ఖ‌ర్చుల‌పై ఏపీ నుంచే ఆరాతీయాల‌ని ఆయ‌న కోర‌డం, దీనివ‌ల్ల ఉన్న లాభాల‌ను భేరీ జు వేయాల‌ని కూడా ఆదేశించ‌డం జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా మెచ్చుకోవ‌డ‌మే! ఇక‌, కేంద్రం కూడా ఏపీలో పాల‌న భేష్‌! అంటూ కితాబు నిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విమ‌ర్శించిన బీజేపీ నాయ‌కుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా .. ఏపీలో ఒకే ద‌ఫా 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌డం దేశంలోనే రికార్డు అవుతుంద‌ని, దీనికి కేంద్రం త‌ర‌ఫున స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు. క‌ట్ చేస్తే.. ఇదంతా జ‌గ‌న్ పాల‌న విధానానికి ద‌క్కుతున్న గౌర‌వం మాత్ర‌మే కాద‌ని అంటున్నారు ఏపీ అధికారులు. 


గాలివాటంగా ఎలాంటి నిర్ణ‌యం ఎప్పుడు తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి నుంచి నిర్దిష్ట‌మైన నిర్ణ‌యాల దిశ‌గా.. తీసుకున్న నిర్ణ‌యంలో ఎంత క‌ష్టం ఉన్నా.. ముందుకు సాగ‌డ‌మే నిర్ణ‌యంగా వేస్తున్న అడుగుల ఫ‌లితంగా ఈ కీర్తి ల‌భిస్తోంద‌ని వారు అంటున్నారు. గ‌తంలో ఇలాంటి పాల‌న లేద‌ని, గంట‌కో నిర్ణ‌యం.. నిమిషానికో.. ఆదేశం ఉండేద‌ని, దీనివ‌ల్లే గ‌త ప్ర‌భుత్వానికి యూట‌ర్న్ ల ప్ర‌భుత్వంగా గుర్తింపు ల‌భించింద‌ని ఎద్దేవా చేసిన అధికారులు కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా సాగితే. ఇక‌, వైసీపీ ప్ర‌భుత్వానికి తిరుగులేద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: