జగన్ సీఎం కాగానే తన మార్కు పాలన తీసుకురావాలనుకున్నాడో.. తానేంటో లోకానికి చాటాలనుకున్నాడు.. మంచి సీఎం అనిపించుకోవాలనుకున్నాడు.. ఆ కోరికను కూడా ఏమాత్రం దాచుకోలేదు. ప్రమాణ స్వీకార వేదికపైనే ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటాను అని చిన్న సైజు శపథం కూడా చేసేశాడు.


అనుకున్నట్టుగానే ఆరు నెలల్లో మంచి వాడు అనిపించుకునేలా పథకాల అమలుకు శ్రీకారం చుట్టాడు.. ఆశావర్కర్ల వేతనాలు పెంచేశాడు.. శభాష్ అన్నారు.. లక్షల సంఖ్యలో గ్రామ వాలంటీర్లు నియమించాలనుకున్నాడు.. పార్టీ వారికే ఇచ్చారని అపవాదులు వచ్చినా.. ఇదీ మంచి నిర్ణయమే. లక్షల కొద్దీ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేశాడు.


ఇలా అంతా బాగానే ఉంది. కానీ పేదలకు రూ. 5 కే అన్నంపెట్టే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను మాత్రం మూసేశాడు. వీటిని మళ్లీ తెరుస్తారని అంటున్నా దానిపై క్లారిటీ లేదు. పేదల కడుపు నిండే క్యాంటీన్లను అవినీతి సాకుతో మూసేయడం విమర్శలకు తావిచ్చింది. ఇలాగైతే మంచి సీఎం ఎలా అవుతాడని విమర్శలు వచ్చాయి. అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని తప్ప.. మొత్తానికే క్యాంటీన్లు మూతేస్తే ఎలా అనేవారు ఎక్కువయ్యారు.


దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం.. కేంటీన్లను మళ్లీ తెరవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 100 రూపాయల విలువ చేసే భోజనం కేవలం 5 రూపాయల కు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కొత్త పేరుతో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.


భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందిందట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను టీడీపీ సర్కారు ఏర్పాటు చేసింది.. వీటి మూసివేత వలన ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుందట.అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: