కృష్ణానదికి వరదలు వస్తే.. సీఎం తన సొంతపనుల కోసం అమెరికా వెళ్లాడు.. అంతకు ముందు గోదావరికి వరదలు వస్తే.. జరూసలేం వెళ్లాడు.. ఇదేం సీఎం.. ఆయనకు ప్రజల బాధలు పట్టావా..ఇదీ తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు.. కానీ.. సీఎం వైఎస్ జగన్ అమెరికాలో ఉన్నా.. ఆయన మనసంతా కృష్ణానది వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపైనే ఉందంటున్నారు వైసీపీ మంత్రులు.


వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. నిత్యం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పడుతోందన్నారు.


ముంపు ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.


కృష్ణా నదికి వరద ప్రభావం క్రమంగా తగ్గుతుందని మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచామని, పునరావాసకేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


టీడీపీ నేతలు వరద రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యం రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: