ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. ఇటీవల ప్రతిపాదిత 'అమరావతి సుస్థిర మౌలిక వసతులు - సంస్థాగత అభివృద్ధి' ప్రాజెక్టుకు రుణం ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంకు చెప్పిందని తెలుగుదేశం అనుకూల పత్రికల నానా హడావిడి చేశాయి.


అంతే కాదు.. ప్రపంచ బ్యాంకు నిర్ణయం ప్రభావంతో అమరావతిలోని వివిధ ప్రాజెక్టులకు రుణమివ్వాలని ఇప్పటి వరకూ భావించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా వెనుకంజ వేసే అవకాశాలు ఉన్నాయని రాశాయి. ప్రపంచ బ్యాంక్‌ రుణంపై నమ్మకం పెట్టుకొని రాజధానిలోని పలు ప్రాజెక్టులపై ఇప్పటికే వందలాది కోట్లను ఏపీసీఆర్డీయే వెచ్చించిందని చెప్పాయి. ఇప్పుడు ఆ సంస్థ ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉందని.. ప్రపంచబ్యాంక్‌ అందజేసే రుణంపై అది వసూలు చేసే వడ్డీ ఇతర ద్రవ్యసంస్థల వడ్డీలతో పోల్చితే బాగా తక్కువ అని కథనాలు వండి వార్చాయి.


అయితే ఆ తర్వాత అసలు వాస్తవం తెలిసింది. ఏపీకి రుణం కోసం చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్టుగా ఈ నెల 15న భారత ప్రభుత్వం తమకు లేఖ రాసినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రుణం ప్రతిపాదనను తాము రద్దు చేసుకున్నట్టు వెల్లడించింది.


ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగినప్పటికీ... ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన అభివృద్ధి ప్రాధామ్యాలను నిర్ణయించుకుని, కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను సంప్రదిస్తే అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ ప్రాజెక్టులకు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నామని, అది కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీటిలో ఆరోగ్యరంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: