తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు స‌రికొత్త అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతోందా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. నిజానికి.. అది స‌రికొత్త అస్త్ర‌మేమీ కాదుగానీ.. మ‌రుగున ప‌డిన అంశాన్ని లేవ‌నెత్తి టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టి లాభ‌ప‌డాల‌ని బీజేపీ చూస్తోంది. తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాల్లో నెల‌కొన్న గంద‌ర‌గోళంలో సుమారు 27మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. 


రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళ‌నలు చేశారు. అప్ప‌ట్లో ఇంట‌ర్ ఫ‌లితాల నిర్వ‌హ‌ణ కాంట్రాక్టు సంస్థ గ్లోబ‌రీనాపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సంస్థ‌కు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో సంబంధాలు ఉన్నాయంటే తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇదంతా కూడా పాత విష‌య‌మేగానీ... తాజాగా సంగ‌తి ఏమిటంటే.. అనూహ్యంగా రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌కోవింద్ స్పందించారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి తాఖీదులు ఇచ్చారు. 


నిజానికి ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పొచ్చు. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌ల అనంత‌రం నిర్వ‌హించిన ఎట్‌హోం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకే ఇలా చేశార‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో చెప్ప‌డం గ‌మ‌నార్హం. 


నిజానికి.. ఇంట‌ర్‌ఫ‌లితాల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై పార్లమెంట్ స‌మావేశాల్లో బీజేపీ ఎంపీలు మాట్లాడారు. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ ఫిర్యాదుపై రాష్ట్ర‌ప‌తి స్పందించి, ఏకంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి నోటీసులు అందించ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఇక ఇదే అద‌నుగా టీఆర్ఎస్‌ను దెబ్బ‌కొట్టాల‌ని బీజేపీ పెద్ద‌లు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండ‌డంతో అధికారాల‌ను వినియోగించుకుని ఇరుకున‌పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం కూడా స్పందించి, చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉటుంద‌ని, అవ‌స‌ర‌మైతే.. ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తు చేప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌నే టాక్ వినిపిస్తోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: