ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాల నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ్రామ వాలంటీర్ల నియామకాల‌కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో నెంబరు 104ను జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఏ స్థాయిలోనూ తావులేకుండా చేసే ఉద్ధేశంతోనే ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రభుత్వంలో కొత్తగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులో పేర్కొన్నారు. కులమత, వర్గ, రాజకీయ బేధాలు లేకుండా అర్హులందరికీ చేరవేయడం కోసమే ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు లక్ష్యంగా పేర్కొన్నారు.


అయితే, ఇంత‌టి కీల‌క‌మైన అవ‌కాశం విష‌యంలో వివాదం ముసిరింది. పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అనూహ్య‌మైన ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. ఆగ్రవర్ణ పేదలకు ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10శాతం రిజర్వేషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి శోచనీయమన్నారు. ఈ చట్టం వచ్చి ఏడు నెలలవుతున్నా రాష్ట్రంలో అమలుకావడం లేదని, విద్య విషయంలో అమలవుతున్నా, ఉద్యోగాల విషయంలో పాటించడం లేదన్నారు. గ్రామ వాలంటీర్ల ఎంపికలో కూడా ఈడబ్ల్యూఎస్ అమలుకాలేదన్నారు. అంతేకాకుండా త్వరలో భర్తీకానున్న గ్రామ సచివాలయ నియామకాల్లో కూడా ఈ విషయంపై సరైన స్పష్టత లేదన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, తెలగ, బలిజ, ఒంటరి తదితర అగ్రవర్ణ కులాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున  న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.


ఇదిలాఉండ‌గా, ఎంపిక జీవో మార్గ‌ద‌ర్శ‌కాలు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏ గ్రామానికి చెందిన వ్యక్తులను అదే గ్రామంలో వాలంటీర్లుగా నియామకానికి ప్రాధమిక అర్హతగా నిర్ధారిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వాలంటీర్లుగా నియమితులయ్యే వారు కనీసం పదవ తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్‌ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయస్సు వారు మాత్రమే దరఖాస్తులు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తుల చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్ధులందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: