నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు. నిన్న పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ మోదీ నాయకత్వాన్ని బలపరిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.


తనను నమ్మి బీజేపీలో చేరుతున్న తన తండ్రి అనుచరవర్గానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అలాగే.. జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారని అన్నారు. పేరులో నిజాం ఉండటం వలన నిజాం సాగర్ నిండట్లేదని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని..


అందుచేతనే నిజామాబాద్ రైతులు బాగుపడట్లేదని అరవింద్ అన్నారు. వెంటనే జిల్లాకు ఇందూరు గా నామకరణం చేయాలనే డిమాండ్ ప్రజలనుండి వస్తుందని ఆయన అన్నారు. ఇకపోతే.. కాంగ్రెస్ మీద పలు విమర్శలు చేసారు. కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసే నాయకుడే లేడని.. ఆ పార్టీ నాయకత్వ లేమితో  కొట్టుమిట్టాడుతోందని అరవింద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ ను రద్దుచేసి ప్రధానమంత్రి మోదీ.. కామన్ సివిల్ కోడ్ (సీసీసీ) ను తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదిలావుంటే.. గడిచిన లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసిన అరవింద్..


రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడుస్తున్నా.. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మీద విజయం సాధించారు. జిల్లాలో  తన తండ్రి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నా తన తండ్రి పలుకుబడిని వాడుకోకుండా బలమైన ప్రత్యర్థిఫై విజయం సాధించి అరవింద్ జిల్లాలో నూతన రాజకీయ ఒరవడికి తెరలేపారు. అలాగే పసుపు రైతులకు అండగా ఉంటానన్న అరవింద్ ఎంపీ అయిన తర్వాత వారిని విస్మరించాడన్న విమర్శలు వున్నాయి.    


మరింత సమాచారం తెలుసుకోండి: