ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు మ‌రోమారు సంచ‌ల‌న రీతిలో వార్త‌ల్లోకి ఎక్కారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ మాయమైనట్టు వచ్చిన వార్తలపై ఆయ‌న సంచ‌ల‌న రీతిలో స్పందించారు. రాష్ట్ర విభజన పూర్తయినప్ప‌టికీ..2017 మార్చి వరకూ హైదరాబాద్‌లోనే అసెంబ్లీ కొనసాగేది. సొంత గడ్డ మీద అసెంబ్లీ నిర్వహించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని ఏపీలోని అమరావతిలో నిర్మించారు. అయితే ఆ కొత్త భవనానికి ఫర్నీచర్‌ హైదరాబాద్‌ నుంచి తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్‌ మాయమైనట్లు గుర్తించారు.అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహరం పై స్పందించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నిచర్ ను తరలిస్తుండగా సామాన్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్ ను తాను వినియోగించుకున్నట్లు అంగీక‌రించారు. 


అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయం అంశం రాజ‌కీయాల్లో క‌ల‌కలం రేకెత్తింది. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడే ఫర్నీచర్‌ పోయిందని అసెంబ్లీ వర్గాలను ఉటంకిస్తూ ప్ర‌చారం జ‌రిగింది. ఫర్నీచర్‌ మాయంపై అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఫర్నీచర్‌ మాయంపై ఇంకా పోలీసులు కేసు అయితే నమోదు చేయలేదని స‌మాచారం. అయితే, అసెంబ్లీ ఫ‌ర్నీచర్‌ను సత్తెనపల్లి, నరసరావుపేటకు తరలించారని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది.


ఇదే స‌మ‌యంలో గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ,  సామాన్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్ ను తాను వినియోగించుకున్నట్లు కోడెల అంగీక‌రించారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు రాసి, ఫర్నిచర్ తీసుకువెళ్ళాలని కోరానని కోడెల వివరణ ఇచ్చారు. అసెంబ్లీ కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని కోడెల ఆరోపించారు. ఇప్పటికయినా అసెంబ్లీ అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగిస్తానన‌ని, లేదంటే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తాను అని కోడెల శివప్రసాదరావు తెలిపారు. కాగా, ఫ‌ర్నీచ‌ర్ మాయం, కోడెల వివ‌ర‌ణ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: