చంద్ర‌యాన్‌2...భార‌త‌దేశం స‌త్తాను చాటిచెప్పిన ప్ర‌యోగం. ఇస్రో చైర్మ‌న్ కే.శివ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌యాన్‌2ను విజ‌య‌వంతంగా లూనార్ ఆర్బిట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కీల‌క ప‌రీక్ష‌లో భాగంగా వ‌చ్చే నెల‌లో చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ దిగ‌నుంది.  సెప్టెంబ‌ర్ 2వ తేదీన చంద్ర‌యాన్‌2కు సంబంధించి మ‌రో కీల‌క ఘ‌ట్టం ఉంటుంద‌న్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంద‌న్నారు. అయితే, వివిధ దేశాలు, స్పేస్ సంస్థ‌లు ఎందుకు చంద్రుడి ద‌క్షిణ ద్రువాన్ని టార్గెట్ చేశాయ‌న్న అంశాన్ని ఇస్రో ఆస‌క్తిక‌ర రీతిలో వివ‌రించింది. 


చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై ఫోక‌స్ పెట్ట‌డం కోసం గ‌ల కార‌ణాన్ని వివ‌రిస్తూ..ఇస్రో ఓ ట్వీట్ చేసింది. భ‌విష్య‌త్తు ప్ర‌యోగాలు, రోద‌సి అన్వేష‌ణ‌ల కోసం చంద్రుడి ద‌క్షిణ ద్రువం అనువైన ప్రాంత‌మ‌ని ఇస్రో భావిస్తోంది. ఇందుకు కార‌ణం...ద‌క్షిణ ద్రువంలో  ఉన్న అనేక అగాధాలు వేల కోట్ల ఏళ్ల నుంచి సూర్యుడి కాంతిని నోచుకోలేదు. ఈ కార‌ణంగా అక్క‌డ సౌర వ్య‌వ‌స్థ ఆవిర్భావానికి చెందిన అనేక విశ్వ ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ ద్రువంపై ఉన్న లోయ‌ల్లో కొన్ని వంద‌ల మిలియ‌న్ల ట‌న్నుల నీరు ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. జీవాధారానికి నీరే ప్ర‌దానం కాబ‌ట్టి.. ఈ కోణంలోనూ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ద‌క్షిణ ద్రువంపై ఉన్న రాళ్ల‌లో అనేక ఖ‌నిజాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. హైడ్రోజ‌న్‌, అమోనియా, మీథేన్‌, సోడియం, మెర్క్యూరీ, సిల్వ‌ర్ లాంటి విలువైన ఖ‌నిజాలు ఉన్న‌ట్లు గుర్తిస్తున్నారు. 


కాగా, చంద్ర‌యాన్ 2లో భాగంగా సెప్టెంబ‌ర్ 3వ తేదీన సుమారు మూడు సెక‌న్ల పాటు ఓ చిన్న‌పాటి ప్ర‌క్రియ ఉంటుంద‌ని శివ‌న్ చెప్పారు. ఆ ప్ర‌క్రియ‌తో ల్యాండ‌ర్ ప‌నితీరు తెలుస్తుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌, తెల్ల‌వారుజామున‌ 1.55 నిమిషాల‌కు చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంద‌ని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు. త‌మ వంతు మాన‌వ ప్ర‌య‌త్నం అంతా చేసిన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: