గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. ప్రభుత్వం అనుకున్న విధంగా ఒక్కొక్క పథకాన్ని గ్రౌండ్‌ చేయడానికి ప్రిపరేషన్స్‌ కూడా దాదాపు సిద్దం చేసుకుంటున్న పరిస్థితుల్లో వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లబోతున్నారు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ క్రమంలో ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్‌ ఇళ్ల పట్టాల పంపిణీ. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ఓ సవాల్‌ అయితే.. కావాల్సిన భూమిని సమీకరించడం మరో పెద్ద సవాల్‌. ఈ క్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీకి కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. సాఫీగా కార్యక్రమం సాగిపోయేందుకు అన్ని రకాల కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్‌. 


ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరో ఎత్తు అనే చెప్పాలి. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టడం ద్వారా రికార్డ్‌ సృష్టించాలని సర్కార్‌ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి పేదల సమస్యల పరిష్కారం పట్ల తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో లబ్దిదారుల ఎంపిక మొదలుకుని.. పట్టాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన భూమిని సమీకరించుకునే దిశగా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్దం చేసి ఉంచింది సర్కార్. దీంట్లో భాగంగా ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన జాయింట్‌ కలెక్టర్లతో డెప్యూటీ సీఎం.. రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సమావేశమయ్యారు. ఓవైపు రెవెన్యూ యంత్రాంగంలో కీలక మార్పులు.. ప్రక్షాళన చేసే అంశాలపై ఫోకస్‌ పెడుతూనే.. ఇళ్ల పట్టాల పంపిణీకి హై ప్రయార్టీ ఇవ్వాలని సుభాష్‌ చంద్రబోస్‌ అధికారులను ఆదేశించారు.


ఇళ్లపట్టాల పంపిణీలో గ్రామ వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషించబోతోంది. లబ్దిదారుల ఎంపిక విషయంలో ఈ నెలఖారు నాటికి ఓ క్లారిటీకి రానుంది రెవెన్యూ శాఖ. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంటుందనే అంశానికి సంబంధించిన నివేదికను సిద్దం చేసి ఉంచాలని రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఈ మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి గ్రామ వలంటీర్లు పేదల ఇళ్ల పట్టాల విషయమై సర్వే చేపడతారు.. లబ్దిదారుల ఎంపికను ఓ కొలిక్కి తేనున్నారు గ్రామ వలంటీర్లు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఇళ్లపట్టాల ఇవ్వాలనే అంశానికి సంబంధించిన వ్యవహరంపై ఓ ప్రాథమిక అంచనాకు రానుంది రెవెన్యూ యంత్రాగం. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఎంత మేరకు ప్రభుత్వ భూమి లభ్యత ఉంది.. ఇంకా ఏమైనా ప్రైవేటు భూమిని ఇళ్ల పట్టాల నిమిత్తం కొనుగోలు చేయాల్సి ఉంటుందా..? అనే అంశంపై స్పష్టత కోసం.. గ్రామాల వారీగా భూ లభ్యతపై సర్వే చేయించనున్నట్టు సమాచారం. ఇక్కడే ప్రభుత్వానికి అసలు సమస్య ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో గ్రామాల్లో భూ లభ్యత లేదనేది రెవెన్యూ వర్గాల  సమాచారం. ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలంటే.. దానికి ఎంత మేర ఖర్చు అవుతుందోననే ఆందోళన కూడా కన్పిస్తోంది.


ప్రభుత్వం మాత్రం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం అవసరమైన భూమి లభ్యం కాకుంటే.. ఎంత మొత్తం వెచ్చించైనా కొనుగోలు చేసి మరీ పేదలకు ఇళ్లపట్టాలు ఇద్దామని భావిస్తోంది. ఈ మేరకు నిధులను కూడా సిద్దం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా అందాయి. ఇళ్ల పట్టాలను హై ప్రయార్టీ ఇస్తున్న క్రమంలో వచ్చే నెల మొదటి వారానికి లబ్దిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్దం చేయడంతోపాటు.. ఎంత మేరకు భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందనే అంశంపైనా నివేదిక సిద్దం చేయనుంది సర్కార్‌.





మరింత సమాచారం తెలుసుకోండి: