అక్రమ నిర్మాణాల పై జీవీఎంసీ ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే విశాఖలో పది వేల వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు కొరడా ఝుళిపించేందుకు రెడీ అవుతున్నారు. అక్రమ నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత వివాదాస్పదంగా మారుతుంది. ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతుంది. కక్ష సాధింపులకు దిగుతున్నారని కేవలం తమ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతుంది. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖ మహానగరంలో జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్థలాలు అన్న తేడా లేకుండా చెలరేగుతున్నారు కబ్జారాయుళ్లు.

ప్రభుత్వ స్థలమయితే చాలు అది వాగైన, కొండ చర్యలైనా ఆఖరుకు ఫుట్ పాత్ లను సైతం వదిలిపెట్టటంలేదు. అవకాశం దొరికినప్పుడు ఎటువంటి అనుమతులూ లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు అర్థబలం, అంగబలంతో నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. విశాఖలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలని కబ్జారాయుళ్లు బాగా వినియోగించుకున్నారు. అధికారులంతా ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉండగా కబ్జారాయుళ్లు ఇదే అదునుగా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. జూన్ లో జీవీఎంసీ అధికారులతో జరిపిన మొదటి సమీక్ష సమావేశంలోనే అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్.

మొద్దు నిద్ర వహించద్దంటూ అధికారులకి క్లాస్ తీసుకున్నారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాల పని పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జీవీఎంసీ కమిషనర్ సృజన, బాధ్యతలు చేపట్టడంతో గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది దూకుడు పెంచారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వీటిని బీపీఎస్ నిబంధలకనుగుణంగా క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెలాఖరి వరకు అవకాశముంది.


బిపిఎస్ తిరస్కరణకు గురైన భవనాలనూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల పై జీవీఎంసీ కొరడా ఝుళిపిస్తూ ఉండడంతో విశాఖలో ఇప్పుడిదే హాట్ టాపిగ్గా మారింది. అక్రమ నిర్మాణాల లిస్టులో టిడిపి నేతల పేర్లు కూడా ఉండడంతో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా ఉపేక్షించేది లేదని జీవీఎంసీ హెచ్చరిస్తుంటే ఇది రాజకీయ కక్ష సాధింపు అని ప్రతి పక్షం మండిపడుతుంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బిపిఎస్ కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది.

దీంతో బిల్డింగ్ కూల్చివేతను జివిఎంసి చేపట్టగా కోర్టును ఆశ్రయించి నిలుపుదల చేయించుకున్నారు పీలా.  దసపల్లా హిల్స్ లోని టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఈ బిల్డింగ్ అక్రమమని తేల్చారు. పార్టీ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయని వైసిపి ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్ వివాదం జీవీఎంసీ కమిషనర్ సృజన పరిశీలనలో ఉంది. మొత్తంగా ఇన్నాళ్లకు అక్రమ నిర్మాణాల పై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అయితే ఎటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గకుండా ఇదే రీతిలో ముందడుగు వేస్తేనే అధికారుల లక్ష్యం నెరవేరుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: