తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ సంవత్సరం అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మరో నలభై రోజుల్లో ఏపీలో నూతన ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని జగన్ ప్రభుత్వం తన పాలసీగా నిర్ణయించుకుంది. ప్రభుత్వానికి దిక్సూచిగా వున్న నవరత్నాల్లో ఇదీ ఒకటి. అందుకే కొత్త మద్యం విధానాన్ని తీసుకొస్తుంది. ఇందుకు సంప్రదించి కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. కొత్త ఎక్సైజ్ సంవత్సరం నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు ఇరవై శాతం తగ్గిపోతాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకు బదులుగా ఇక పై మూడు వేల ఐదు వందల షాపులు మాత్రమే కొనసాగుతాయి.


అదే విధంగా ప్రైవేటు షాపులకు బదులుగా అక్టోబర్ నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ షాపులు వెలుగులోకి వస్తాయి. ఇందు కోసం ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా మొదలైంది. షాప్స్ కు అనుబంధంగా ఉండే పరిమిట్ రూమ్స్ ను కూడా రద్దు చేయనున్నారు. ఇటువంటి పరిణామాలతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని ఎవరైనా భావిస్తారు. అయితే ఇక్కడే ప్రభుత్వం మ్యాజిక్ చేసింది. మద్యం ధరలను పెంచడంతో పాటు వ్యాట్ ను పెంచి ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. తద్వారా గతేడాది కంటే సుమారు ఐదు వేల కోట్ల ఆదాయం పెరగవచ్చని భావిస్తున్నారు.


దశల వారీగా మద్యపానాన్ని నిషేధించాలన్న నిర్ణయంలో భాగంగా ధరలను పది శాతం పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో చీప్ లిక్కర్ ధరలకు కూడా రెక్కలు వస్తాయి. ఒక్కో బాటిల్ ధరను రూపాయి నుంచి రెండు రూపాయలు పెంచిన రౌండ్ ఆఫ్ పద్ధతిలో పది రూపాయలు పెరుగుతుంది. వంద రూపాయల బాటిల్ నూట పది రూపాయల అవుతుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ రౌండ ఆఫ్ విధానం ఏపీలో అమలు అవుతుంది. గత ఏడాదిలో ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా ఆరు వేల రెండు వందల ఇరవై కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుందని అంచనా వేసింది.


ఆ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదించింది ప్రభుత్వం. ఎక్సైజ్ ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే సింహభాగం లభిస్తుంది. ఆ తరువాత మద్యం అమ్మకాలపై విధించిన వ్యాట్ ద్వారా మరి కొంత ఆదాయం వస్తుంది. మధ్యం ధరలు పెంచడంతో పాటు వ్యాట్ పెంపుదలతో కలిపి మొత్తం ఐదు వేల కోట్ల వరకు అదనంగా ఆదాయం లభించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించాలి అన్నది ప్రభుత్వ విధానమైన ఆదాయం తగ్గకుండా నిషేధం దిశగా వెళ్లాలన్నది ఆలోచనగా కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: