సొంత ఇంటి సమస్యలను చంద్రబాబు పరిష్కరించుకుంటున్నారా? ఎడ మొహం పెడ మొహంలా ఉన్న హరికృష్ణ ఫ్యామిలీని దగ్గర చేసుకోబోతున్నారా? అత్యవసర సమయాల్లో పలకరింపులు తప్ప సత్ససంబందాలు లేని జూనియర్ ఎన్టీఆర్ తో మాట కలిపింది అందుకేనా? మనం మనం ఒక్కటేనని అన్నారా? తారక్‌ని టీడీపీకి దగ్గర చేసే కసరత్తు మొదలైందా?


చంద్రబాబు‍‍‍‍, ‍‍హరికృష్ణ ఫ్యామిలీ మధ్య పెద్దగా సత్ససంబంధాలు లేవు. బాలయ్యతో వియ్యం అందుకున్నా హరికృష్ణతో మాత్రం చంద్రబాబుకు పొగిసేది కాదు. వారి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో ఏమో కానీ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లని వరకు అది వెళ్లింది. రాష్ట్ర విభజన వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ , తర్వాత పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే వారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబుకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. మొదట్లో హరికృష్ణ ప్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండే వారు. ఎప్పడైతే ఆ ఫ్యామిలీతో చంద్రబాబుకు పొగసలేదో... హరికృష్ణ, ఆయన కొడుకులుతో జూనియర్ కలిసిపోయి ఒక్కటయ్యారు. హరికృష్ణ లాగే జూనియర్ కూడా చంద్రబాబుతో ఎడ మొహం పెడ మొహం అన్నట్టే ఉండేవారు. జూనియర్ మామ వైసీపీలో ఉన్నారు. తారక్‌కి కూడా పరోక్షంగా వైసీపీతో సంబంధాలున్నాయని ప్రచారం జరిగింది.



గతేడాది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించాక.. ఆ ఫ్యామీలీకి  దగ్గరయ్యారు చంద్రబాబు. హరికృష్ణ ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసే వరకు అంతా దగ్గర ఉండి చూసుకున్నారు. అదే సమయంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుభాషిణిని కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీకి దింపారు. రెండు ఫ్యామీలీల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని అంతా అనుకున్నారు. కానీ జూనియర్ మాత్రం చంద్రబాబు ట్రాప్‌లో పడలేదు. అక్క కోసం కూకట్‌పల్లిలో టీడీపీ తరుపున ప్రచారానికి రాలేదు. ఏదో ఒక లేఖ రాసి సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత  కూడా రెండు ఫ్యామిలీలు కలవలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ తరుపున ప్రచారం చేయలేదు జూనియర్‌. వైసీపీ చేతిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 23 మంది ఎమ్మెల్యేలతో  ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది.


ఇటీవల హరికృష్ణ మొదటి వర్థంతి సందర్భంగా మరోసారి నందమూరి ఇంటికి వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజీపడటం, పాత సంబంధాలను కలుపుకోవడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. పార్టీకి ఎవరు అవసరం ఉంటారో వాళ్లను ఎలా దగ్గర చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. తిరిగి కోలుకునే మార్గాలు ఇప్పుడైతే కనిపించడం లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే నైజం ఉన్న చంద్రబాబు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే... జూనియర్ తో మాట కలిపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కసరత్తు వెనుక రెండు కారణాలు ఉన్నాయి. బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడిని టీడీపి ఎదుర్కొంటోంది. టీడీపీ సీనియర్ నేతలకు వరుసగా వల విసురుతోంది కమలం పార్టీ. వయో భారం కారణంగా చంద్రబాబు పార్టీ నడపలేరనే భావనను బీజేపీ ప్రచారం చేస్తుంది. టీడీపీలో ఉండే నేతలకు భవిష్యత్తులేదనే భయాన్ని కలిగిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అండగా ఉన్నారనేది స్పష్టం కావాలి. అందు కోసమే గతాన్ని వదిలేసి జూనియర్ ను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారట చంద్రబాబు. 





మరింత సమాచారం తెలుసుకోండి: