గత తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి రైతుల దగ్గర 33 వేల ఎకరాలని తీసుకుని నిర్మాణ పనులని చేపట్టిన విషయం తెలిసిందే. కొన్ని తాత్కాలిక పరిపాలన భవనాలు కట్టి పాలన కూడా చేసింది. అయితే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో రాజధాని విషయంలో ప్రజల్లో అనుమానాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వం నిర్మాణ పనులని ఆపేసింది.


కానీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడే క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని , కానీ గత టీడీపీ ప్రభుత్వం నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడిందని అందుకే పనులు ఆపామని, త్వరలోనే పనులు చేపడతామని ప్రకటన కూడా చేశారు. సీఎం క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వంలో సీనియర్ నేత, మున్సిపాలిటీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం జగన్ పరువు తీసేలా రాజధాని విషయంలో ప్రకటనలు చేస్తున్నారు.


అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే జగన్ అమరావతి నిర్మాణంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ పొంతనలేని ప్రకటనలు చేసి రాజధాని విషయంలో కన్ఫ్యూజ్ చేశారు. తాజాగా కృష్ణా నదికి వరదలు వచ్చాయి. వరదల వల్ల కొన్ని లంక గ్రామాలు మునిగాయి తప్ప, రాజధాని గ్రామాలకు ఏం కాలేదు. కానీ దీన్ని సాకుగా చూపి బొత్స రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల కారణంగా అమరావతిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని ప్రకటించారు. ముంపు భయం నుంచి బయటపడాలంటే, కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉన్నందున.. నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందన్నారు.


పైగా వరదనీటిని తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని, అందుకే ఖర్చు పెరిగి ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఉంచాలా.. వద్దా అని ఆలోచిస్తున్నట్లుగా బొత్స చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇక బొత్స ఈ ప్రకటనలతో ప్రజల్లో ఇంకా అనుమానాలు పెరిగాయి. రాజధాని అమరావతిలో ఉండదా అని భయపడుతున్నారు. కానీ సీఎం మాత్రం అమరావతే రాజధానిగా ఉంటుందని ఆల్రెడీ చెప్పారు. బొత్స మాత్రం ఇలాంటి ప్రకటనలు చేసే జగన్ పరువు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి దీని పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: