వైసీపీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీతో మొదలై ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలు, 24 మంది ఎంపీలతో విరాజిల్లుతోంది. అంతే కాదు, లక్షల్లో నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ వైసీపీ ఏపీలో గట్టి పునాది వేసుకుంది. తెలుగు రాజకీయాల్లో టీడీపీ, టీయారెస్ తరువాత మూడవ బలమైన ప్రాంతీయ పార్టీగా వైసీపీ గుర్తింపు తెచ్చుకుంది. ఇక చట్టసభల్లో వైసీపీ వాణి వినిపించడం  2011 నుంచి మొదలైంది. ఏపీ అసెంబ్లీని పూర్తిగా కమ్మేసిన వైసీపీ ఇపుడు శాసనమండలిలోనూ మెల్లగా  తన హవా చాటుకుంటోంది.


శాసనమండలిలో వైసీపీకి అచ్చంగా ఆరుగురు మాత్రమే నిన్నటి వరకూ ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ద్వారా ఎన్నికైన ముగ్గురుతో కలుపుకుని ఇపుడు తొమ్మిది మంది ఎమ్మెల్సీలు వైసీపీకి వస్తారు. అంటే వైసీపీ గొంతు పెద్దల సభలో పెరుగుతోందన్నమాట. ఇక గవర్నర్ కోటాలో మార్చి నెలలో మరో రెండు సీట్లు ఖాళీ కాబోతున్నాయి.  అవి కూడా వైసీపీకే దక్కుతాయి. ఆ విధంగా చూసుకుంటే 11 మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీకి అవుతారు.


అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఈ ఏడాది అంతానికి పూర్తి చేయాలని వైసీపీ సర్కార్ డిసైడ్ అయింది. దాంతో ఎటూ వైసీపీ హవా ఉంటుంది కాబట్టి మెజారిటీ సీట్లు దక్కుతాయి. ఆ తరువాత లోకల్ బాడీ ద్వారా వచ్చే ఎమ్మెల్సీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు.  ఇక అన్నింటికన్నా ముఖ్యమైన  ఏడాదిగా 2021ని భావిస్తున్నారు. ఆ ఏడాది టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్సీలు రిటైర్ అయిపోతారు. ఎటూ బలం ఉన్న పార్టీగా వైసీపీ మొత్తానికి మొత్తం ఎమ్మీల్సీ సీట్లు మరో మారు గెలుచుకోవడం ద్వారా 2021 తరువాత ఏపీ శాసనమండలిలో బలమైన పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంటున్నారు.



అప్పటికి 33 మంది ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల బలం బాగా తగ్గిపోతుంది. అలాగే,  2023 నాటికి మాజీ మంత్రి లోకేష్ కూడా ఎమ్మెల్సీగా  రిటైర్ అయిపోతారు దాంతో దాదాపుగా టీడీపీ పెద్దల సభలో ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. వాటికి నాందిగా ఇపుడు ముగ్గురు ఎమ్మెల్యేలు పెద్దల సభలో ఫుల్ జోష్ తో అడుగుపెడుతున్నారని అంటున్నారు. మొతానికి పెద్దల సభలో వైసీపీకి బాగా జోరు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: