నవ్యాంధ్ర  పడుతూ లేస్తూ ఉంది. అయిదేళ్ళలో ఎన్నో చూసింది కానీ అభివ్రుధ్ధిని మాత్రం చూడలేదు. అనుభవం అని చంద్రబాబుని తలకెత్తుకుంటే రాజధాని, పోలవరం రెండూ అలాగే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ రెండింటి మీదనే ద్రుష్టి పెట్టారు. ముఖ్యంగా జగన్ అమరావతి రాజధాని విషయంలో కచ్చితమైన వైఖరితో ఉన్నారు. అమరావతి రాజధాని చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అందరికీ తెలిసిందే.


చంద్రబాబు కూడా లక్షల కోట్లు అవుతాయని అంచనాలు వేసి కేంద్రానికి పంపితే అయిదేళ్ళలో వచ్చింది 1500 వందల కోట్లు మాత్రమే. ఇక అమరావతిలో ఇప్పటికీ పెర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఒక్క ఇటుక ఆ దిశగా పడలేదు. మరో వైపు అమరావతి రాజధానికి సేఫ్ ప్లేస్ కాదని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. ఇక రాజధానిపై నాటి కేంద్ర సర్కార్ నియమించిన శివరామక్రిష్ణ కమిటీ కూడా అమరావతి రాజధానికి సరైన ప్లేస్ కాదని తేల్చింది. అది భూకంపాల జోన్, వరదలు కూడా వస్తాయని హెచ్చరించింది. అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం కూడా ప్రమాదకరమని క్లారిటీగా చెప్పేసింది. అయితే చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని అని డిసైడ్ చేసేశారు.



ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమరావతిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాజికవర్గం ప్రయోజనం కోసం మాత్రమే అమరావతి నిర్మిస్తున్నారన్న ఆరోపణలు కూడా వైసీపీ నేతలు చేస్తూ వచ్చారు. ఇక ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా జరిగిందని జగన్ సీఎం గా అయ్యాక కూడా ఆరోపణలు చేశారు. అంటే జగన్ మదిలో ఏముందో చెప్పకనే చెప్పారు కానీ బయటకు గట్టిగా ఇంతవరకూ చెప్పలేదు. ఇపుడు క్రిష్ణమ్మ ఆ అవకాశం ఇచ్చింది. వరదలు పెద్ద ఎత్తున కనీ వినీ ఎరగని రీతిలో ముంచెత్తి అమరావతి రాజధాని ప్రాంతాన్ని  ముంచేసిన ఘటనలు యావత్తు ఏపీ  ప్రజలు కళ్లారా చూశారు. ఇపుడు అదే సాక్ష్యంగా చేసుకుని జగన్ అమరావతి అనుకూలం కాదని చెప్పబోతున్నారట. 



జగన్ నోటి మాటనే మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ మీడియా మీట్లో చెప్పారని భావిస్తున్నారు. బొత్స అన్నది కూడా అదే. వరదల నుంచి అమరావతిని కాపాడాలంటే ప్రత్యేకంగా చెక్ డ్యాములు,   డ్రైన్లు కూడా పెద్ద ఎత్తున కట్టాలని, అలాగే ఫ్లై ఓవర్లు కూడా కట్టాలని చెప్పారు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమని కూడా ఆయన అన్నారు. తొందరలోనే అమరావతి రాజధాని పై ప్రభుత్వ వైఖరి చెబుతామని కూడా బొత్స చెప్పారు. అంటే అమరావతి  రాజధాని మీద ఇక జగన్ సర్కార్ కుండబద్దలుకొట్టబోతుందన్నమాట. మరి కొత్త రాజధాని ఎక్కడ ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: