ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్ళు లేని పేదలకు 25 లక్షల ఇళ్ళ స్థలాలను ప్రభుత్వం ఇవ్వబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. పట్టణ ప్రాంతంలో ఒక సెంటు ఇంటి స్థలం ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకోవటానికి దశల వారీగా గృహ నిర్మాణ శాఖలో అమలులో ఉండే పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తారు. 
 
గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారిని, పట్టణాల్లో సంవత్సర ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్నవారిని అర్హులుగా పరిగణిస్తారు. పట్టణాల్లో ఐదు ఎకరాలకు పైగా మెట్టభూమి లేదా రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగబోతుందని తెలుస్తుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతోందంటే గ్రామాన్ని, పట్టణాన్ని ఒక యూనిట్ గా తీసుకొంటారు. 
 
ఇంటిస్థలాలు పొందటానికి లబ్ధిదారులైన వారి నుండి ధరఖాస్తులను స్వీకరిస్తారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు ధరఖాస్తులు పరిశీలించిన తరువాత గ్రామ, వార్డ్ సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రచురిస్తారు. ఆ జాబితాలోని పేర్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ, వార్డ్ సభల ద్వారా తుది జాబితాను ఎంపిక చేయటం జరుగుతుంది. 
 
గ్రామ, వార్డ్ సభల తరువాత ఎంపికయిన జాబితాను ప్రాంతాన్ని బట్టి తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ యొక్క ఆమోదానికి పంపుతారు. కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాల్లో ప్రచురిస్తారు. కలెక్టర్ల అనుమతి పొందిన తరువాత ప్రచురించిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ల అనుమతితో ఆ ప్రాంతానికి చెందిన తహశీల్దార్లు లేదా మున్సిపల్ కమిషనర్లు సమస్యను పరిష్కరిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: