జగన్ అమెరికా పర్యటన ముగిసింది.. ఆయన అక్కడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పాటు.. ప్రవాసాంధ్రుల కమ్యూనిటీతో నూ సమావేశం అయ్యారు. ప్రత్యేకించి డల్లాస్ లో తెలుగు ప్రతినిధులతో పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. సభ కూడా బాగానే జరిగింది.


అయితే ఈ సభలో కొంత గందరగోళం జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకూ వాస్తవం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. ఈ గందరగోళంలో రెండు విషయాలు ఉన్నాయి.. ఒకటి చాలా సింపుల్ విషయం .. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రెండో గందరగోళం మాత్రం చాలా సీరియస్ అంశం.


ముందు మొదటిది చూద్దాం.. సాధారణంగా తెలుగుసభల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తాం..కానీ ఈ సభలో ఆ పని చేయకుండా జగన్ తెలుగువారి సెంటిమెంట్లు అవమాన పరిచారని ప్రచారం జరుగుతోంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సభలో అసలైన వైసీపీ అభిమానులకు అవమానం జరిగిందంటూ ఓ ఇమెయిల్ సర్క్యలేట్ అవుతోంది.


అమెరికాలో పార్టో కోసం మొదటి నుంచి పని చేసిన వారికి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదని..అసలు పట్టించుకోలేదని.. చాలా సీనియర్లు పెద్ద వారిని కూడా అవమానించారని ఆ ఇమెయిల్ ఉంది. పార్టీకి పది లక్షల వరకూ డొనేట్ చేసిన వారిని కూడా సరిగ్గా పట్టించుకోలేదట. నిర్వాహకులు కొందరికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారని.. నిర్వహణ పరమ లోపభూయిష్టంగా జరిగిందని ఈ ఇ మెయిల్ లో ఆరోపించారు.


అమెరికాలో ఉన్న కుర్ర నాయకులు.. పెద్దలంటే గౌరవం లేకుండా వ్యవహరించారని.. ఐదుగురు అమెరికా కన్వీనర్లు ఉన్నా.. నిర్వహణ దారుణంగా ఉందని.. ఆరోపించారు. మరి ఈ ఇ- మెయిల్ అసలైన అభిమాని హర్ట్ అయ్యి రాసిందా.. లేక వైసీపీ పేరుతో టీడీపీ సృష్టించిందా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైందే అయితే అది వైసీపీలోని వర్గపోరును సూచిస్తుంది. జగన్ ఇలాంటి వాటిని ఆదిలోనే నిరోధిస్తే పార్టీకి మేలు జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: