శంభునాథ్ దాస్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం కావటంతో కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో శంభునాథ్ దాస్ తలకు భారీగా దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా 18 వ తేదీన శంభునాథ్ దాస్ మృతి చెందారు. చనిపోయిన తరువాత శంభునాథ్ దాస్ శవాన్ని మార్చురీలో భద్రపరచి పోస్టు మార్టం చేసారు. పోస్టు మార్టం చేసిన తరువాత శంభునాథ్ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
తెల్లని వస్త్రం, ప్లాస్టిక్ కవర్ తో చుట్టిన శంభునాథ్ దాస్ శవాన్ని చూడటానికి కుటుంబ సభ్యులు తెల్లని వస్త్రాన్ని తొలగించిన తరువాత షాక్ అయ్యారు. శంభునాథ్ దాస్ శవానికి కళ్ళు లేవు. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆసుపత్రి సిబ్బందిని శంభునాథ్ దాస్ కళ్ళు ఏమయ్యాయని నిలదీయగా కళ్ళు ఎలుకలు తినేసి ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 
 
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యం శవానికి కృత్రిమ కళ్ళను ఉంచి కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించారు. ఈ ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆ ఆసుపత్రి కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసాడు.  
 
72 గంటల్లో ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీలోని సభ్యులను ప్రిన్సిపల్ ఆదేశించాడు. ప్రాథమిక విచారణలో మార్చురీలో శవాలను ఉంచే ప్రదేశంలో పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయని ఆ ఎలుకలే కళ్ళు తినేసి ఉండొచ్చని తేలిందని ప్రిన్సిపల్ చెప్పినట్లు సమాచారం. పూర్తి నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండటం వలన ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: