కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం చిక్కుల్లో ప‌డిపోయారు. ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరెట్ (ఈడీ) అధికారులు ఎదురుచూస్తున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టుకు రంగం సిద్ధమైంది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం.. ఢిల్లీ కోర్టు తీర్పును సవాలు చేసే పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ దృష్టికి తీసుకెళ్లి.. అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఆయన ఏ క్షణమైనా అరెస్టు కావొచ్చని తెలుస్తోంది.


ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. మూడు రోజులపాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. మంగళవారమే కేసును సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టే విధంగా చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఐఎన్‌ఎక్స్ కేసును ఓ ప్రత్యేకమైన మనీ లాండరింగ్ (హవాలా) కేసుగా అభివర్ణించింది. సమర్థవంతమైన విచారణ జరుగడానికి నిర్బంధ విచారణ అవసరమని జస్టిస్ సునీల్ గౌర్ పేర్కొన్నారు. 


దీంతో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగిన అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. రెండు గంటల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ, ఈడీ అధికారులు  పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ బుధవారం ఉదయం 10.30 గంటలకు జరుగనున్నట్టు సమాచారం. అయితే, ఇక్క‌డ చిదంబ‌రానికి అనుకూలంగా తీర్పు రాక‌పోతే ఆయ‌న అరెస్టు ఖాయ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: