కృష్ణా నదికి గత పదేళ్లలో ఎన్నడూ రానంత వరద వచ్చినా.. ఆ జలాలను జగన్ సర్కారు సద్వినియోగం చేసుకోలేక పోయిందా.. వరద నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందా.. కాస్త ముందు జాగ్రత్తగా ఉండి ఉంటే.. కృష్ణా వరద జలాలతో రాయలసీమ సస్యశ్యామలం అయ్యేదా.. చివరకు ముఖ్యమంత్రి సొంతజిల్లా కడప, జలవనరుల శాఖ మంత్రి సొంత జిల్లా నెల్లూరుకు కూడా కృష్ణా జలాలను సరిగ్గా తరలించే లేక సముద్రంలో కలిపేశారా..?


అవునంటున్నారు తెలుగు దేశం నేతలు.. ఇక ఆ పార్టీకి చెందిన దేవినేని ఉమ అయితే మరింతగా రెచ్చిపోయారు. పరిపాలన అంత సులభం అనుకుంటున్నారా.. మా సోమిరెడ్డి అడిగి తెలుసుకోండి.. అంటూ చురకలు వేశారు. కృష్ణా జలాలలను వృథా చేశారని మండిపడ్డారు.


అయితే ఇప్పుడు దీనికి వైసీపీ నుంచి కూడా బాగానే కౌంటర్ వస్తోంది. మంత్రులంతా కలిసి సమన్వయంతో పనిచేయడం ద్వారా వరదల నష్టాన్ని తగ్గించగలిగామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడం కూడా సమన్వయం వల్లే జరిగిందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశాలలో ఉంటూ సమీక్షలు నిర్వహించారని ఆయన చెప్పారు.


ఇంత చేసినా కేవలం తెలుగుదేశం వారికి మాత్రమే కడుపు మంటగా ఉందని మంత్రి బొత్స అంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని బొత్స మండిపడ్డారు. రాయలసీమకు నీరు వెళ్లడం లేదని ఆయన అబద్దాలు చెబుతున్నారని... ఈనాడు పత్రికలోనే కడప జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించు కున్నాయని ఫోటోలతో సహా వార్తలు వేసిందని రుజువులు చూపిస్తున్నారు.


ఈ వార్తలను దేవినేని ఉమ గుర్తించాలని బొత్స సూచించారు. ఇక వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపైనా బొత్స మండిపడ్డారు. ప్రజలు ఎవరూ తమకు సాయం అందలేదని ఫిర్యాదులు చేయకపోయినా, చంద్రబాబు మాత్రం తగుదునమ్మా అంటూ బయల్దేరారని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: