మొత్తానికి చంద్రబాబునాయుడు ఓ విషయంలో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమనిర్మాణం ఎవరిది అనే విషయంలో అందరిలోను అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. ఒకసారి ప్రైవేటు భవనం అన్నారు. తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. తాజాగా అది ప్రైవేటు భవనం అని మళ్ళీ అంటున్నారు.

 

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలోనే కొందరు భూములు ఇవ్వటానికి ఎదురుతిరిగారు. దాంతో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చి బలవంతంగా కొన్ని భూములను స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే లింగమనేని గెస్ట్ హౌస్ వ్యవహారం వివాదాస్పదమైంది.

 

లింగమనేని గెస్ట్ హౌస్ ను బలవంతంగా అయినా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చంద్రబాబు ఒకపుడు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వానికి లింగమనేని గెస్ట్ హౌస్ స్వాధీనం చేయాలని లేకపోతే తామే స్వాధీనం చేసుకుంటామని సిఎంగా ఉన్నపుడు చెప్పారు.

 

తర్వాత తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ లింగమనేని తన గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి ఇచ్చేశారని సడన్ గా ప్రకటించారు చంద్రబాబు. అదే విషయాన్ని లింగమనేని కూడా ధృవీకరించారు మీడియాతో మాట్లాడుతు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత నుండి లింగమనేని గెస్ట్ హౌస్ విషయంలో ఎంత వివాదం రేగుతోందో అందరూ చూస్తున్నదే.

 

ఎంత వివాదం రేగినా తానుంటున్న భవనం ప్రభుత్వందా ? లేకపోతే ప్రైవేటు భవనమా ? అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పటం లేదు.  ఈ విషయమై ఎంత అడిగినా నోరిప్పటం లేదు. అలాంటిది వరదలంతా తగ్గిపోయిన తర్వాత కృష్ణాజిల్లాలోని కొన్ని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తానుంటున్న భవనం ముణిగిపోతే యజమాని బాధపడాలి కానీ ప్రభుత్వానికి ఎందుకు బాధ ? అంటూ నలదీశారు. అంటే చంద్రబాబు తాజా ప్రకటనతో తానుంటున్నది ప్రైవేటు భవనమే అని ధృవీకరించినట్లైంది. మరి లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్నట్లు చెప్పింది అబద్ధమేనా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: