తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ఓ పార్శిల్ వచ్చింది. సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయంలో ఉంది. కానీ దాని నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. ఇదేంటి ఇలా వస్తోందని పరిశీలిస్తే.. అలాంటివే మరో 60 పార్శిళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అలాంటివే.. అన్నీ కూడా ప్రముఖుల పేరుతో ఉన్నాయి. సీఎం కేసీఆర్ తోపాటు.. గవర్నర్‌ నరసింహన్‌, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ ఎంపీ కవిత, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌.. ఇలా లిస్టు చూస్తే అంతా వీఐపీలే.


మరి వీరందరికీ ఇలాంటి పార్శిళ్లు ఎందుకు పంపారు.. ఇంతకీ అంతగా బ్యాడ్ స్మెల్ వస్తున్న ఆ పార్శిళ్లలో ఏముంది.. తపాలా అధికారులను వేధించిన ప్రశ్నలు ఇవే. అందుకే వారు వీటికి సమాధానం కోసం ఆ పార్శిళ్లను తెరిచి చూశారు. సీసాలు కనిపించాయి. వాటిల్లో రసాయనాల మాదిరి ద్రవం ఉంది. దాంతో వారిలో కొత్త అనుమానం కలిగింది. ఒకవేళ ఇవి కెమికల్ బాంబులేమో అన్న అనుమానం వచ్చింది. ఎందుకొచ్చిన గొడవ అని పోలీసులకు సమాచారం అందించారు.


వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసుల క్లూస్ టీమ్ పరిశ్రమల్లో వాడే రసాయన వ్యర్థాలుగా గుర్తించింది. అందులో ఏముందో కచ్చితంగా తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపారు. ఐతే.. ఈ పార్శిళ్ల పంపిణీ వెనుక ఎలాంటి కుట్ర లేదని.. కేవలం తమ సమస్యను ప్రముఖుల దృష్టికి తెచ్చేందుకే కొందరు ఈ పని చేసి ఉంటారని మరో కథనం వినిపిస్తోంది.


ఎందుకంటే.. ఈ పార్శిళ్లతో పాటు కొన్ని లేఖలు కూడా ఉన్నాయి. వాటిలో కలుషిత నీళ్లు తాగి ఇలా ఉన్నాం..అన్న సారాంశం ఉంది. ఈ పార్శిళ్లు ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీసు నుంచి వచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య చాలా ఉంది. దీనిపై గతంలో చాలా కథనాలు వచ్చాయి. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ ప్రాంత వాసులు ఇలా పార్శిల్లు పంపి ఉంటారని అనుమానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: