ఏపీలోని కడప జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుతో మరణించారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను వైద్య చికిత్స కోసం హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. స్తానిక హాస్ప‌ట‌ల్లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకువెళ్ళాలని వైద్యులు సూచించారు. దీంతో బ్రహ్మయ్యను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.


హైదరాబాద్ శివార్లలోని ఓ ఆసుపత్రికి బ్రహ్మయ్యను తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మ‌య్య పోటీ చేయాల‌ని త‌న‌కు లేదా త‌న కుమారుడికి సీటు ఇవ్వాల‌ని బాబుపై తీవ్ర‌మైన ఒత్తిడి తెచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌కు ముందే 
ఫిబ్రవరిలోనే బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 


చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో అప్పుడు రమేష్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించిన అనంతరం ఆయన కోలుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశించారు. కానీ అది ఆయనకు దక్కలేదు. రాజంపేట సీటును ప‌క్క‌నే ఉన్న రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బ‌త్యాల చెంగ‌ల్రాయుడుకు ఇచ్చిన చంద్ర‌బాబు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బ్ర‌హ్మ‌య్య ఫ్యామిలీకి ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.


ఇక బ్ర‌హ్మ‌య్య విష‌యానికి వ‌స్తే సాధారణ కార్యకర్తగా టీడీపీలో చేరిన ఆయన 1994లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన బ్రహ్మయ్యను చంద్రబాబు తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. చిన్నతరహ పరిశ్రమలు, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో మూడోసారి పోటీచేసిన ఆయన ఓటమి చవి చూశారు. 2004 ఎన్నిక‌ల నుంచి రాజ‌కీయాల్లో ఆయ‌న అంత‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయారు. వ‌రుస ఓట‌ముల‌తో రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: