ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత రోజాపై టైం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా ప‌దునైన పంచ్‌ల‌తో విరుచుకుప‌డుతూనే ఉంటుంటారు. 2014 ఎన్నిక‌ల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచినా... టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌డు అసెంబ్లీలో రోజా బాబుపై తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఆమెను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం... చివ‌ర‌కు ఆమె ఈ విష‌యంలో సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లి ఫైట్ చేయ‌డం చూశాం.


ఇక తాజాగా ఏపీలో కృష్ణా క‌ర‌క‌ట్ట మీద ఉన్న చంద్ర‌బాబు ఇంట్లోకి కృష్ణా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేర‌డంతో వ‌ర‌ద రాజ‌కీయం జోరందుకుంది. చంద్ర‌బాబు ఇళ్లు ఖాళీ చేయాల‌ని వైసీపీ నేత‌లు ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రోజా మ‌రోసారి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కరకట్ట వద్ద ఇల్లు కట్టకూడదనీ, వరద వస్తే మునిగిపోతుందని ఎంతమంది చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వినిపించుకోలేదని రోజా తెలిపారు. 


ఓ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసించారని... అందుకు ఆయ‌న చాలా సిగ్గుప‌డాల‌ని కూడా ఆమె విమ‌ర్శించారు. వరద కారణంగా జరుగుతున్న నష్టం, ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు జలవనరుల శాఖ డ్రోన్ ను వాడితే, తన ప్రాణాలు తీయడానికి వాడినట్లు చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్ర‌బాబును టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం మాకు లేద‌ని... ఆయ‌న్ను ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌లు టార్గెట్ చేసి ఇంటికి పంపేశార‌ని సెటైర్లు వేశారు. చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కి అయినా విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని రోజా సూచించారు. ఇక టీడీపీ నేత‌ల‌ను కూడా ఆమె వ‌ద‌ల్లేదు. టీడీపీ నేతలు వరదలపై చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు చూడలేకపోతున్నారన్న రోజా... అందుకే వాళ్లు డ్రోన్ రాద్దాంతం చేస్తూ అంద‌రిని డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: