వర్షాకాలం వచ్చిందంటేనే పిడుగులు విరుచుకుపడుతూంటాయి. జనావాసాలు, పొలాలు, చెరువులు.. తేడా లేకుండా ఎక్కడైనా పిడుగులు పడుతూంటాయి. వీటి వల్ల కరెంట్ సరఫరా ఆగిపోవడం, మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలు కూడా బలైపోతూంటాయి. ఒడిషా రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృతి చెందారు. ఒడిశాలో పలు చోట్ల పడిన పిడుగులకు ఆరుగురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు.

 


వర్షాకాలం కావటంతో ఒడిషాలోని కేంద్రపారా, పూరీ జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో బుధవారం పిడుగులు పడ్డాయి. కేంద్రపారా జిల్లాలో నలుగురు వ్యక్తులు, పూరీ జిల్లాలో ఇద్దరు పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో వారు పిడుగుల బారిన పడ్డారని అధికారులు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కియోంజర్‌, మయూర్‌భంజ్‌, కటక్‌, మల్కన్‌గిరి, కొరాపుత్‌, నబరంగ్‌పూర్‌, కలహంది, బోలంగిర్‌, బారా గఢ్‌.. జిల్లాల్లో గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా మీదుగా రుతుపవనాలు విస్తరించి ఉండడం వల్ల ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ధెంకనల్‌, జాజ్‌పూర్‌, భద్రక్‌, కేంద్రపారా, కటక్‌, ఖుద్రా, పూరీ, కంధమల్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటాయని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని అధికారులు వివరించారు. దీంతో వ్యవసాయ పొలాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

 


టెక్నాలజీ డెవలెప్ మెంట్ తో పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలిపే వ్యవస్థను మెరుగుపరచుకుంటే ఇటువంటి సమయాల్లో ప్రాణ నష్టాన్ని అరికట్టొచ్చు. ఒడిషా రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థ లేదు. దీంతో తుఫాను ప్రభావిత రాష్ట్రమైన ఒడిషాలో పిడుగుల వల్ల ప్రాణ నష్టం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: