రాజధాని అమరావతిలో ఉంటుందా? లేక మారిపోతుందా...? మారిపోతే ఎక్కడకి వెళుతుంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజల మనసులని తొలిచేస్తున్నాయి. ఇక రాజకీయ నేతలు తమకు ఇష్టం వచ్చిన ప్రకటనలు చేసి ప్రజలని మరింత కన్ఫ్యూజన్ లో నెట్టేస్తున్నారు. అటు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు రాజధాని అమరావతి నుంచి మారిపోతుందని  పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆ ప్రకటనలన్నిటిని కొట్టి పారేస్తూ సీఎం జగన్ అమరావతి విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు.


అమరావతే రాజధానిగా ఉంటుందని ఇందులో మార్పు లేదని ప్రకటన కూడా చేశారు. కానీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ ప్రజలని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా కృష్ణా నదికి వరదల వచ్చిన నేపథ్యంలో కొన్ని లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని, రాజధాని మార్పు విషయం ఆలోచిస్తున్నామని ఓ తలతిక్క ప్రకటన చేశారు.


ఈ ప్రకటనతో రాష్ట్రంలో రాజధాని ప్రకంపనలు చెలరేగాయి. ప్రతిపక్ష టీడీపీ రాజధానిని మారిస్తే ఆందోళనలు చేస్తామనే సిగల్స్ ఇస్తుంది. అలాగే అధికార వైసీపీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి నేతలు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తుంటే, సీమ, నెల్లూరు, ప్రకాశం నేతలు దొనకొండని రాజధాని చేయాలని కోరుతున్నారు. ఇక బొత్స లాంటి వారు రాజధాని మార్పు విషయం ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. 


ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సరికొత్త ఆలోచన చెప్పారు. రాజధానిగా అమరావతి వద్దు, దొనకొండ వద్దు తిరుపతిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దొనకొండలో రాజధాని ఏర్పాటుకి వసతులు లేవని, అందుకే తిరుపతి బెస్ట్ అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందే ప్లేస్ తిరుపతి మాత్రమే అని చెప్పారు. రాజధానిగా దొనకొండ ఆలోచనను సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని మోహన్ డిమాండ్ చేశారు. 


ఏపీ రాజధాని అంశం సున్నితమైందని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అయితే ఎవరెన్ని రాజధాని విషయంలో మాట్లాడినా సీఎం జగన్ తీసుకునే నిర్ణయం ఫైనల్ కానుంది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాగానే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటివరకూ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటే చాలా మంచిదని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు. జ‌గ‌న్ ఈ గాసిప్స్‌కు చెక్ పెట్టేలా ఓ ప్ర‌క‌ట‌న చేస్తే వీటికి తెర‌ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: