రాజధానిని వేరే ప్రాంతానికి మార్చడానికి పెద్ద కుట్ర జరుగుతుందని రాజధాని తరలింపుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని తరలింపునకు విజయసారెడ్డి ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ లే ఉదాహరణ అని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కృష్ణా నదికి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడే రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాలేదని అన్నారు.



మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల తాకిడికి శ్రీశైలం గేట్లు ఒకేసారి ఎత్తడంతో నీళ్లు వచ్చాయని అన్నారు.రాజధాని ప్రాంతంలో కేవలం రాయపూడి ప్రాంతానికి మాత్రమే వరద నీరు వచ్చిందని రాజధానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన తెలిపారు. రాజధానిని తరలిస్తే కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతుందని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే అమరావతిపై అనేక అనుమానాలు కమ్ముకొన్నాయి. అనుకున్నట్లుగానే రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులతో పాటు అమరావతి పనులను ఆపేశారు. రాజధానిపై పలువురు మంత్రులు వేరు వేరు సందర్భాల్లో పలు రకాల ప్రకటనలు చేశారు. మాకు సింగపూర్, లండన్ కట్టాలని లేదు అమరావతి మాకు ప్రాధాన్యం కాదు ఆర్ధిక పరిస్థితిని బట్టి నిర్మిస్తాం అని గతంలో ఓ మంత్రి పేర్కొన్నారు.



అయితే పురపాలక మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రం అమరావతిపై అనుమానాలూ వద్దని ఒకట్రెండు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో అమరావతిపై బొత్స కీలక ప్రకటన చేయటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే మంత్రి ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. అమరావతిలో పలు అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్షంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. తాము అధికారంలోకి వస్తే రాజధాని వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయిస్తామని కూడా జగన్ ప్రకటించారు.



ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి అసలు పనులు మొదలే కాని ఒకవేళ మొదలైన ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పనులు మాత్రమే జరిగిన రాజధాని లోని అన్ని ప్రాజెక్టుల్ని ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఫలితంగా అమరావతిలోని ప్రాజెక్టుల్లో ఎనభై శాతానికి పైగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పైగా రాజధానికి ఇవ్వాల్సిన వెయ్యికోట్లు ఇప్పుడు అక్కర్లేదని విచారణ పూర్తయ్యాక శాస్త్రీయంగా ఎంత అడగాలో అంతే అడుగుతామని ఇటీవల ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకుంది. ఏఐబీ కూడా తన రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.



రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలును గడువు దాటి రెండు నెలలు దాటినా చెల్లించక పోవడం, ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులకు ఇస్తున్న ముప్పై శాతం స్పెషల్ అలవెన్స్ రద్దు,అమరావతి నిర్మాణంలో పని చేస్తున్న పలు కన్సల్టెంట్ సంస్థలకు మంగళం, పెద్ద సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన, సీఆర్డీయే ఏడీసీ కార్యాలయాల కుదింపు వంటి చర్యలతో అమరావతిపై జగన్ సర్కార్ వైఖరి భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అమరావతిలో ప్లాట్ ల ధరలు సుమారు నలభై శాతం వరకు పడిపోయాయి. పొదుపుదారులు, రియల్టర్ లు అటు వైపు చూడడమే మానేశారు. ఇదే సమయంలో అమరావతి భవిష్యత్తుపై మరిన్ని అనుమానాలు నెలకొనేలా బొత్స ప్రకటన వెలువడడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: