వారిద్దరూ కీలక నేతలు. హస్తినలో పార్టీ వాయిస్ వినిపించిన నేతలు. పార్టీకి నేషనల్ లుక్ ఇవ్వడంలో వారిద్దరూ కలిసి పని చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వారి సేవల్ని గుర్తించిన పార్టీ ఒకరికి పదవి ఇచ్చింది. మరి మరొకరి సంగతేంటి అని ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. మిగిలిన ఆ ఒక్కరికీ కీలక పదవి ఇస్తారా లేక పార్టీ వాయిస్ గా మారుస్తారా.? నిన్న వినోద్, రేపు కవిత మాజీ ఎంపీలకు కీలక పదవులు.



రెండు వేల పద్నాలుగులో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో బోయినపల్లి వినోద్ కుమార్, కవితలు కీలకంగా వ్యవహరించారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ గెలవలేదు. పార్టీ పరంగా ఈ ఇద్దరు నేతలు క్రియాశీలకంగా ఉండేవారు.దీంతో వీరికి రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడయ్యారట. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు.



వినోద్ కు మంచి భెర్త్ దొరకడంతో అందరి చూపు కవిత వైపు మళ్లింది. మాజీ ఎంపీ కవితకు ఏం పదవి ఇస్తారు అనే విషయంపై పార్టీ లో తీవ్ర చర్చ నడుస్తోంది. కవితకు కుదిరితే కేబినెట్ పదవి లేదా రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారనే వార్త టీఆర్ ఎస్ వర్గాల్లో షికారు చేస్తోంది. క్యాబినెట్ లోకి ఇద్దరు మహిళా మంత్రులకు అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. దీనికి తోడు రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి.



దీంతో కవితకు ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చి, మంత్రిని చేస్తారనే ప్రచారం గులాబిదళంలో  జోరుగా సాగుతోంది.మరోవైపు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. సమితి ప్రెసిడెంటు పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ పోస్టు ఖాళీగా ఉంది. నిజామాబాద్ లో రైతుల సమస్యలు ఎక్కువ.



పసుపుబోర్డు లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కవితకు ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ప్రగతి భవన్ లో నడుస్తోందని సమాచారం. ఈ చర్చలు ఇలా సాగుతుంటే కవిత వర్గీయులు మాత్రం పదవుల కేటాయింపుపై ఎలాంటి సమాచారం లేదని, తమ నేత పదవులు కోరుకోవడం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: