ఐ ఎన్ ఎక్స్ మీడియాకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీఏ హయాంలో ఆర్థిక శాఖా మంత్రిగా పని చేసిన చిదంబరంను సీబీఐ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేసారు. నిన్న రాత్రి అంతా సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే చిదంబరంను ఉంచగా ఈరోజు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు చిదంబరంను హాజరు పరచబోతున్నారని తెలుస్తుంది. మంగళవారం రోజు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరగా ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది. 
 
సుప్రీం కోర్టు శుక్రవారం వరకు తక్షణ విచారణ చేయటం కుదరదని చిదంబరం తరపున న్యాయవాదులకు తెలిపింది. నిన్నంతా కనిపించకుండా పోయిన చిదంబరం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని, చట్టాన్ని గౌరవిస్తానని సీబీఐ చార్జ్ షీట్లో తన పేరు లేదని చిదంబరం అన్నారు. మీడియాకు చెప్పాల్సిందంతా చెప్పేసి చిదంబరం 8 గంటల 20 నిమిషాలకు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. 
 
అక్కడినుండి చిదంబరం తన తరపు న్యాయవాదులతో కలిసి జోర్ బాఘ్ లోని ఇంటికి వెళ్ళారు. చిదంబరం ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులకు ఇంటి గేట్ వేసి ఉండటంతో సీబీఐ అధికారులు గోడ దూకి వెళ్ళారు. ఆ తరువాత మరో సీబీఐ టీమ్, ఈడీ అధికారులు, ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొంత సమయం పాటు చిదంబరంను రకరకాల ప్రశ్నలు వేసి ఆ తరువాత సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్ట్ చేసిన తరువాత చిదంబరంను 9 గంటల 46 నిమిషాల సమయంలో  సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకొనివెళ్ళారు. అదుపులోకి తీసుకున్న తరువాత చిదంబరంకు వైద్య పరీక్షలు నిర్వహించారని సమాచారం. 10 గంటల 20 నిమిషాల సమయంలో చిదంబరంను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: