ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ర్యాంగింగ్ చాలా సాధారణంగా మారింది. దీన్ని అరికట్టేందుకు ఎన్ని పటిష్టమైన నిబంధనలు పెట్టినా.. కళాశాల యాజమాన్యాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. తాజాగా మరో ర్యాగింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇటావాలోని సైఫై వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో కొత్త విద్యార్థులను ఘోరంగా అవమానించారు.


కొత్త విద్యార్థులందరికీ సీనియర్లు గుండు గీయించారు. ఆ తర్వాత అంతా యూనిపారమ్ మాదిరిగా తెల్లటి కోట్లు ధరించి రావాలని హుకం జారీ చేశారు. అంతేనా.. గుండు కొట్టించుకుని.. తెల్ల కోటు వేసుకుని.. అంతా ఓ వరుసలో పేరేడ్ చేయాలట. అదీ కూడా మామాులుగా కాదు.. వంగి వంగి సలాములు చేసుకుంటూ క్యాంపస్ అంతా ఓ రౌండ్ కొట్టాలట.


పాపం ఎంతైనా జూనియర్లు.. సీనియర్ల మాట వినకపోతే ఏం చేస్తారో అన్న భయం.. దాంతో వాళ్లు చెప్పినట్టు తూచా తప్పకుండా తెల్ల కోట్లు వేసకుని వంగి వంగి సలాములు కొట్టుకుంటూ క్యాంపస్ అంతా ఓ రౌండ్ వేశారు.. ఈ దృశ్యాలను ఎవరో సెల్ ఫోన్ తో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇప్పుడు ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.


ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇష్యూపై సీరియస్ అయ్యిందట. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక అందించమని కోరిందట. ఇప్పుడు అధికారులు ఆ పనిలో పడ్డారు. కొత్త విద్యార్థులను ప్రశ్నిస్తే.. ఆ సీనియర్ల బండారం బయటపడక మానదు. ఇలా ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేయడమే కాక.. చేజేతులా తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు సీనియర్ విద్యార్థులు. ర్యాంగింగ్ పై ఎంత అవగాహన పెంచినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: