అగ్గిపుల్లా.. సబ్బు బిల్లా కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి..అది ఆయన కవితాదృష్టి... అలాగే కళాదృష్టి ఉండాలే కానీ.. ఈ సృష్టిలో మానవ సృష్టిలో పనికి రానిది అంటూ ఏదీ ఉండదని నిరూపించాడో ఔత్సాహికుడు.. సరిగ్గా వాడటం తెలియాలే కానీ.. పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదని ప్రపంచానికి చాటి చెపుతున్నాడు.


మనం రోజూ ఒకసారి వాడి పారేసే వస్తువులు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా వాటిల్లో ప్లాస్టిక్ వస్తువులే ఎక్కువ.. ఇవన్నీ కాలుష్యాన్ని పెంచి పోషించేవే. కానీ మన నిత్య జీవితంలో వాడిని వాడకుండా ఉండలేనంతగా అలవాటు పడిపోయాం. అందుకే ఆ కాలుష్యం తగ్గించేందుకు.. వాడి పారేసే వస్తువులను తిరిగి ఉపయోగించేందుకు ఓ ఐడియా కనిపెట్టాడు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన నల్లూరి రాఘవరావు.


వాడి పారేసిన వస్తువులతో అంతా ఆశ్చర్యపోయేలా ఏకంగా ఓ విడిది గృహాన్నే నిర్మించాడు. సముద్ర తీరంలో ఓ అందాల రిసార్టును ఆవిష్కరించాడు .. తాగి పారేసే వాటర్ బాటిళ్లలో ఓ గదినే నిర్మించాడు. సోలార్‌ వాటర్‌ హీటర్లు పాడైన తరువాత చెత్తవాడికి వేసేస్తాం.. వాటిని సేకరించి.. వాటిలోని కాపర్‌ ప్లేట్లను విడదీసి వాటితో కూడా ఓ ఇల్లు నిర్మించేశాడు రాఘవరావు.


అంతే కాదు.. ప్యాకింగ్‌తో వచ్చే చెక్కముక్కలు, రంధ్రాలుపడ్డ కుండలు.. ఇలా రాఘవరావు దేన్నీ వదలలేదు.. అన్నింటిలోనూ కళాదృష్టితో కొత్త ఆవిష్కరణలు చేశాడు. కళాకృతులుగా రూపొందించాడు. గాజు సీసాలతో వాటికి విద్యుత్‌ అలంకరణ చేశారు. అంతేనా.. పాడైపోయిన టైర్లు... ఎడ్లబండి చక్రాలను కూడా మంచి డిజైన్లతో ఆర్ట్ పీసుల్లా తీర్చిదిద్దాడు. కొత్తపట్నం బీచ్‌లో వ్యర్థాలతో ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటోంది. అక్కడకు వచ్చి ఫోటోలు, సెల్ఫీలు దిగే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రజల్లో స్వచ్ఛ భారత్ పట్లఅవగాహన పెంచేందుకే ఈ ప్రయత్నం చేశానంటున్నారు రాఘవరావు.


మరింత సమాచారం తెలుసుకోండి: