ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ హోం మంత్రి చిదంబరం అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికిముందు జరిగిన హైడ్రామా అంతా..తమిళనాడులో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి అరెస్ట్ ఎపిసోడ్ ను గుర్తుకుతెచ్చింది. చిదంబరం కూడా సాదాసీదా వ్యక్తికాదు. యూపీఏ హయాంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న నేత. ఇంతటి చరిత్ర ఉన్న చిదంబరానికి .. ఇప్పుడీ పరిస్ధితి ఎలా వచ్చింది. ఐఎన్ ఎక్స్ కేసులో ఆయన ప్రమేయమెంత అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ..చిదంబరంపై కేసు వెనుక అమిత్ షా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లపాటు చిదంబరం ఓ వెలుగు వెలిగారు. హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. 2005లో అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు విచారించారు. సోహ్రాబుద్దీన్‌పై 60 కేసులు పెండింగ్‌లో ఉండేవి. పోలీసు కస్టడీలో ఉన్న అతడు హత్యకు గురయ్యాడు.


అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అనుమతితోనే సోహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం ఆదేశాలతో ఈ కేసును 2010 జనవరిలో సీబీఐకి బదిలీ చేశారు. ఆరు నెలల తర్వాత.. అంటే జూలై 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అమిత్ షాను అరెస్ట్ చేసింది. అప్పట్లో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్టుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది. రాజకీయ బలంతో అమిత్ షా సాక్షులను భయపెట్టి ఆధారాలు లేకుండా చేసే ప్రమాదం ఉందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న అమిత్ షా‌కి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే కోర్టు వారంతాపు సెలవు రాగా.. సీబీఐ జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్‌ను ఆశ్రయించింది. దీంతో అమిత్ షా 2010 నుంచి 2012 వరకు గుజరాత్‌లో అడుగు పెట్టకుండా బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్‌.


అయితే ఆ కేసులో అప్పటి హోం మంత్రి చిదంబరం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్థులపై దాడుల కోసం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు అమిత్ షా. 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్లో అమిత్ షాకు అన్ని కేసుల నుంచి ఉపశమనం లభించింది. అమిత్ షా నిర్దోషి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను హింసించిందని బీజేపీ ఆరోపించింది. నాడు కేంద్రంలో చక్రం తిప్పిన చిదంబరం నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతలపై ప్రతీకార్య చర్యలకు పాల్పడటం మన దేశంలో సర్వసాధారణమై పోయింది. దీంతో.. తనను జైలుకు పంపిన చిదంబరంను ఇపుడు కేసుల్లో ఇరికించి అమిత్ షా ఆయన్ను జైలుకు పంపారని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: