ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈరోజు మీడియాతో మాట్లాడారు.మగవారు కూడా తమ ఇంట్లో ఆడవారిగురించి ఆందోళన చెందుతున్నారనే విషయం వాస్తవం. మహిళా కమిషన్ అనేది మగవారికి వ్యతిరేకమైనది కాదు. మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడటానికి, పని చేయటానికి ప్రత్యేకించి ప్రభుత్వానికి సహకరించటానికి ఉంది. మహిళలకు సంబంధించి ఏదైనా నేరం జరిగినపుడు మహిళా కమిషన్ వస్తుంది మహిళా కమిషన్ మాట్లాడుతుంది అనే పరిస్థితులు కూడా పోవాలి. 
 
నేరం జరిగిన తరువాత మాత్రమే కాదు నేరం జరగకముందే మహిళా కమిషన్ కొన్ని చర్యలు తీసుకోగలిగింది అనే చైతన్యాన్ని, ప్రభుత్వ యంత్రాంగంలో కదలికను తీసుకొచ్చిందని అనిపించుకోవటమే తన కోరిక అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మహిళల పట్ల నేరాలలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉండటం చాలా బాధాకరమైన విషయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. 
 
ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని గ్రామంలో ఉన్న పరిస్థితులు, గ్రామంలో జరిగినటువంటి మహిళల పట్ల నేరాలు, ఆ నేరాలకు గల కారణాలను, ఏం చేస్తే ఈ నేరం జరగకుండా ఉండేదనే విషయాల కొరకు మహిళా కమిషన్ కొన్ని కేస్ స్టడీస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. 
 
మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణం అనేది ఒకటి ఉంది. డ్వాక్రా రుణం తీసుకోవటం కానీ, ఆ రుణంతో వారి జీవనోపాధికి ప్రణాళిక వేసుకోవటంలో కానీ గతంలో జరిగిన తప్పుల వలన మహిళలు ఈరోజు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. ఈ ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పథకాలతో పాటు మహిళా కమిషన్ కూడా మహిళల అభివృధ్ధికి కృషి చేస్తుందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడైనా ఆలసత్వం ప్రదర్శిస్తే గుర్తు చేస్తామని, మహిళల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. దశలవారీగా మధ్యపాన నిషేధం వైపు వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: