కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి తిక్క వ్యాఖ్యలు చేశారు ట్రంప్‌. లోయలో ప్రజల మధ్య సఖ్యత లేదని రెండుగా విడిపోయారన్నారు. దాయాది దేశాల మధ్య దశాబ్ధాలుగా కాల్పులు కొనసాగుతున్నాయంటూ పాత పాటే పాడారు. 


తలతిక్క వ్యాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందుంటారు. ఆయన చర్యలు, మాటలు ఊహాతీతం. ఏ సమయంలో ఎలా రియాక్ట్‌ అవుతారో అస్సలు చెప్పలేం. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని  ఎన్నిసార్లు చెప్పినా... ఆయన మాత్రం మారట్లేదు. చెప్పిందే చెబుతూ... అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. నెల కిందటే కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమంటూ కారు కూతలు కూసిన ట్రంప్‌... మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సమస్య పరిష్కారం కోసం పాక్‌-భారత్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ చాలా సంక్లిష్టమైన ప్రాంతమని.. అక్కడ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారన్నారు. 


అంతేకాదు.. ఇరుదేశాలు మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నారు. నిజాయితీగా చెప్పాలంటే అక్కడ బద్దలయ్యే పరిస్థితి ఉందన్నాడు ట్రంప్. ఇప్పటికే ఇరుదేశాల ప్రధానులతో తాను మాట్లాడాననీ, వారు తన స్నేహితులన్నారు. దశాబ్దాలుగా అక్కడ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వానికి ట్రంప్‌ ఉత్సాహం ప్రదర్శించినప్పటికీ.. ఆయన ఆఫర్‌ను తిరస్కరించింది భారత్‌. కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని, మూడో వ్యక్తి అసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఏమైనా ఉంటే ద్వైపాక్షికంగా పరిష్కరించకుంటామని తేల్చి చెప్పింది.


డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్నారు. ఆయన్ను సమర్థించాలో.. వ్యతిరేకించాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. కశ్మీర్ అంశంపై ట్రంప్ జోక్యాన్ని కోరని బీజేపీ అధిష్టానం.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఏమి చేయాలో తెలియక మౌనంగా ఉంటున్నారు. జోక్యం కోరకుంటేనే ఇలా ప్రవర్తిస్తే కశ్మీర్ విషయంలో ట్రంప్ సలహా కోరితే ఎలా వ్యవహరించేవాడో అని మాట్లాడుకుంటున్నారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: