వెనిజులాలో ఆకలి కేకలు మిన్నంటున్నాయి. 40 లక్షల మంది జనం దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. మరోవైపు అమెరికాతో చర్చల్లో పురోగతి ఉందని మదురో సర్కారు ప్రకటించింది. కొన్ని నెలలుగా ట్రంప్ ప్రభుత్వంతో రహస్యంగా చర్చలు జరుపుతున్నామని మదురో అంగీకరించారు. కొన్నాళ్లుగా వెనిజులాలో రాజకీయ అనిశ్చితి ఉంది. దీనికి తోడు ఆర్థికవ్యవస్థ కుదేలవడంతో.. వెనిజులా వాసులకు ఓ రొట్టెముక్క దొరకడం కూడా గగనమైపోయింది. 


బతకాలంటే బయటి దేశానికి వెళ్లాల్సిందే. ఇదీ ఇప్పుడు వెనిజులా వాసుల తాజా నినాదం. హ్యుగో చావెజ్ ఉన్నన్నాళ్లూ ఓ వెలుగు వెలిగిన వెనిజులా.. ఆ తర్వాత సంక్షోభం కోరల్లో కూరుకుపోయింది. దీనికి తోడు నికోలస్ మదురో అసమర్థ పాలన.. అవినీతిని కూడా విపరీతంగా పెంచేసింది. ప్రభుత్వం మీద అసంతృప్తి ప్రతిపక్ష నేత జాన్ గుయాడో ప్రజా ఉద్యమాన్ని లేవదీశారు. అయితే సామరస్యంగా సమస్య పరిష్కరించాల్సిన అధ్యక్షుడు మదురో బలప్రయోగాన్ని నమ్ముకున్నారు. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి. గుయాడో నేతృత్వంలో సర్కారును యాభై దేశాల ప్రభుత్వాలు గుర్తించడంతో.. మదురోకు టెన్షన్ పట్టుకుంది.


అటు వెనిజులా ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. విపరీతంగా పతనమైన చమురు ధరలు.. ఆ దేశాన్ని సంక్షోభంలో పడేశాయి. ప్రభుత్వ సామాజిక కార్యక్రమాలతో దిగులు లేకుండా బతికిన వెనిజులా వాసులు.. చిన్న రొట్టె ముక్క కూడా దొరకని పరిస్థితుల్లో విదేశాలకు వలసపోతున్నారు. ఇప్పటివరకు 40 లక్షల మంది ఇతర దేశాలకు వెళ్లిపోగా.. ఇంకా చాలా మంది వెళ్లడానికి రెడీగా ఉన్నారు. వెనిజులాలో ఉంటే తిండి లేక చావడం ఖాయమని చాలా మంది పౌరులు భావిస్తున్నారు. దీంతో పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి మదురో సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 


ఇప్పటివరకు ప్రజా ఉద్యమంపై దృష్టిపెట్టిన మదురో.. ముందు ఆర్థికవ్యవస్థను చక్కదిద్దాలని భావిస్తున్నారు. దీంతో అమెరికా సర్కారుతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల్ని అమెరికన్ మీడియా బయటపెట్టింది. వెనిజులా ప్రభుత్వంలో నంబర్ టూ పొజిషన్లో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు.. అమెరికా అధికారులతో చర్చలు జరరుపుతున్న విషయాన్ని మదురో కూడా ధృవీకరించారు. త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని కూడా చెప్పారు. దీంతో వెనిజులాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: