ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ అరెస్ట్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  రాజ‌కీయ పెద్ద‌ల‌ను సంతోష‌పెట్టేందుకు చిదంబ‌రాన్ని అరెస్టు చేశార‌ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ప్ర‌తీకారేచ్ఛ‌తోనే అరెస్టు చేశార‌ని ఆరోపించారు. తాజాగా చిదంబ‌రం అరెస్టుపై కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. చిదంబ‌రం అరెస్టులో పార్టీ కానీ, ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఏమీ లేద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్ప‌డిన వ్య‌క్తుల‌ను శిక్షించాల‌న్న అంశాన్ని ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించ‌వ‌ని, అవి కోర్టులే చూసుకుంటాయ‌ని మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌న్నారు. చ‌ట్టం ప్ర‌కార‌మే కోర్టు నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. 


కాగా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియంగా గాంధీ సీబీఐ చర్యలను ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరం ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి అలా అగౌరవపరచడం అన్యాయమన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో​ భాగంగా చిదంబరాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం. దశాబ్దాలుగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆర్థిక, హోం మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్ర పూరితంగా కేసుల్లో ఇరికేంచే  ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్యఇది. చిదంబరం పట్ల  సీబీఐ తీరు అవమానకరమైంది. మేం ఆయనకు మద్దతుగా నిలుస్తాం. న్యాయం కోసం ఆయన తరఫున పోరాడతామంటూ ప్రియాంకా ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్ పార్టీ కార్యాచ‌ర‌ణ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: