మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే చిక్కుల్లో ప‌డ్డారు. రూ.450 కోట్ల నిధుల అవ‌క‌త‌వ‌క‌ల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయ‌న్ను విచారిస్తోంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల ఎగవేత కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా రాజ్‌ థాకరే, మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కుమారుడు ఉన్మేశ్‌ జోషికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22న ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే రాజకీయ కక్షతో ఈడీ నోటీసులిచ్చిందని ఎంఎన్‌ఎస్‌ నేతలంటున్నారు.


ఐఎల్ఆండ్ఎఫ్ఎస్‌ గ్రూప్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దర్యాప్తు చేస్తోంది. ILFS గ్రూప్ కోహినూర్ సీటీఎన్ఎల్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ కోహినూర్ సీటీఎన్ఎల్ సంస్థ ముంబయిలోని దాదర్ ఏరియాలో కోహినూర్ స్క్వేర్ టవర్ ను నిర్మిస్తోంది. ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసులోనే రాజ్ థాకరేను ED అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండ‌గా, రాజ్ థాకరే అనుచరుడు దేశ్ పాండేను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోహినూర్‌ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్‌ఠాక్రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్‌ జోషి, రాజేంద్ర శిరోద్కర్‌లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు.

రాజ్ థాకరేను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ముంబయిలోని మెరైన్ డ్రైవ్, ఎంఆర్ఏ మార్గ్, ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈడీ ఆఫీస్, రాజ్ థాకరే ఇల్లు, ఎంఎన్ఎస్ ఆఫీస్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.  శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలాఉండ‌గా, రాజ్‌ ఠాక్రేకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పరోక్ష మద్దతు ప్రకటించారు. రాజ్‌ఠాక్రేను ఈడీ ప్రశ్నించినా ఒరిగేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: