జగన్ విషయంలో ఓ పాట చెప్పుకోవాలి. సాహసం నా పధం. రాజసం నా రధం  అంటూ  తన మార్గం దుర్గమం అయినా సరే ఆయన దూకుడుగా దూసుకుపోతారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా కూడా లెక్కచేయరు. అవన్నీ జగన్ ఒక పార్టీ నాయకునిగా ఉన్నపుడు చెల్లాయి.  ఒక వేళ చెల్లకపోయినా వచ్చిన నష్టం పరిమితం, కేవలం ఆయన పార్టీ వరకు మాత్రమే అది ప్రతిఫలిస్తుంది. ఇపుడు జగన్ అయిదు కోట్ల మంది ప్రజలకు నాయకుడు, ప్రభుత్వాధినేత.


అటువంటి జగన్ ఇపుడు కూడా నా రూటే సెపరేట్ అంటూ దూసుకుపోతానంటే కొంత ఇబ్బందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చినది లగాయితూ రివర్స్ టెండరింగ్ అంటున్నారు. ఆ ముచ్చట కాస్తా ఈ రోజు హైకోర్టు తీర్పులో తీరిపోయింది. జగన్ రివర్స్ టెండరింగ్ కి హైకోర్టు రివర్స్ గేర్ వేసింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నవయుగ కాంటాక్టుని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది.


ఈ విషయంలో తొలిసారిగా వైసీపీ సర్కార్ కి కొర్టు మొట్టికాయలు పడ్డాయి. అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకుండానే కోర్టు నుంచి ఇలా మొట్టికాయలు పడడం అంటే జగన్ సర్కార్ కి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామంగానే చూడాలి. జగన్ చాలా దూకుడుగా వెళ్తున్నారని అంతా అనుకుంటున్న వేళ కోర్టులు సైతం అదే మాట అనడంతో ఆ ఆరోపణలకు రాజముద్ర పడినట్లైంది. ఇది చంద్రబాబుకు చాలా వూరటను ఇచ్చే అంశంగా మారుతోంది.


కోర్టు తీర్పు ఇలా వచ్చిందో లేదో బాబులో కొత్త జోష్ కనిపించింది. రాష్ట్రానికి శని పట్టిందా, లేక పిచ్చి పట్టిందా అంటూ బాబు ఓ రేంజిలో వూగిపోయయారంటే జగన్ సర్కార్ మీద ఎంతటి నెగిటివ్ ప్రచారానికైనా తాను సిధ్ధమని శంఖారావం పూరించినట్లుగానే భావించాలి. జగన్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని బాబు కోరారు. మరి జగన్ బాబు మాట కాకపోయినా కోర్టు మాట మేరకైనా తన విధానాన్ని మార్చుకుంటారా అన్నది చూడాలి.


మరో వైపు విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాలపై సమీక్షలు, అమరావతి రాజధాని మార్పు ప్రచారం, అన్న క్యాంటీన్ల రద్దు. రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ఇబ్బందులు, ఇంకో వైపు వాలంటీర్ల వ్యవస్థతో పాత కాంట్రాక్ట్ ఉద్యోగాలకు చెల్లు చీటి పాడడం వంటి వాటితో జగన్ ఈ సరికే జనంలో చెడ్డ పేరు తెచ్చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. వరదలు గోదావరి, క్రిష్ణా నదులకు వస్తే జగన్ పత్తా లేకుండా పోవడం కూడా టీడీపీకి అనుకూలంగా చేసుకుంటోంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ దూకుడుకి హైకోర్టు బ్రేకులు వేసింది. దాన్ని బట్టి అయినా యువ సీఎం తన వైఖరి మార్చుకుని ముందుకు సాగితే మంచిదని అంతా సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: