కేంద్రమాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబ‌రం అరెస్టు దేశ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు.  ఆస్తి కోసం తన సొంత కుమార్తెను దారుణంగా కడతేర్చిన నరహంతకిగా మారిన ఇంద్రాణీ ముఖర్జియా వ‌ల్లే చిదంబ‌రం క‌స్ట‌డీలో ఉండాల్సిన ప‌రిస్థితి ఎదురైంద‌ని తెలుస్తోంది. 


కుమార్తెను హత్య చేసిన కేసులో ఐఎన్‌ఎక్స్‌ మీడియా అధిపతులైన పీటర్‌, ఇంద్రాణి ముఖర్జియా దంపతులు 2015 ఆగస్ట్‌లో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. తన కూతురు షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచిపెట్టిన‌ ఇంద్రాణీ పరిస్థితుల ప్రభావం వలన స్కెచ్‌ వేసి మొదటి భర్త సాయంతో షీనాను చంపేశారు. అయితే ఇప్పుడు ఆమె నిందితురాలిగా జైలు జీవితం గడుపుతున్నారు. ఆమె ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారడమే చిదంబరం అరెస్టుకు దారి తీసిందని అంటున్నారు. 


అయితే, కాంగ్రెస్ దీనిపై మండిప‌డుతోంది. సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలున్న మహిళ స్టేట్‌మెంట్‌ ఆధారంగా సీనియర్‌ రాజకీయ నేతను అరెస్ట్‌ చేశారని పరోక్షంగా ఇంద్రాణి ముఖర్జియాను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రతినిధి సుర్జీవాలా సీబీఐపై విరుచుకుపడ్డారు. అప్రూవర్‌గా మారి ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ స్టేట్‌మెంట్‌పై ఆధారపడి సీబీఐ ఈ కేసులో  విచారణ సాగిస్తోందని  రణ్‌దీప్‌ సుర్జీవాలా దుయ్యబట్టారు. 


కాగా, త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చిదంబరం అరెస్టుపై మాట్లాడుతూ..  రాజకీయ విద్వేషంతోను చిదంబరంను అరెస్టు చేశారన్నారు. ముందస్తు బెయిల్‌ కోరినప్పటికీ ఆయనకు బెయిల్‌ రాకుండా చేసి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. చిదంబరం అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ``చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు గోడ దూకి వెళ్లారు. ఇలా చేయడం దేశానికే సిగ్గు చేటు`` అని స్టాలిన్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: