ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన ఉదంతం మ‌రో మ‌లుపు తిరిగింది. పి.చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఆదేశాలు ఇచ్చింది. గురువారం ఉదయం 3 గంటల పాటు ఆయనను ప్రశ్నించిన సీబీఐ...తమ విచారణలో చిదంబరం ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదని.. దీంతో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించింది. దీంతో కోర్టు ఈ మేర‌కు అనుమ‌తించింది. త‌ద్వారా  ఆగస్ట్ 26 వరకు చిదంబరంను తమ కస్టడీలో ఉంచి సీబీఐ ప్రశ్నించనుంది. అయితే, ఈ సంద‌ర్భంగా ప‌లు ష‌ర‌తులు విధించింది. 


ఢిల్లీలోని జోర్‌బాగ్‌లోని  చిదంబ‌రం నివాసంలో ఆయ‌న్ను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అనంతరం సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించి గురువారం ప్రాథ‌మిక విచార‌ణ అనంత‌రం ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి కోరింది. అధికారులు కోరినట్టుగా 5 రోజుల పాటు కస్టడీ విచారణకు సీబీఐ కోర్టు అంగీకరించింది. గురువారం  సాయంత్రం కస్టడీ ఆదేశాలు రావడంతో.. 23, 24, 25, 26 తేదీల్లో చిదంబరం ఇంటరాగేషన్ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిదంబరంను సీబీఐ అధికారులు  ప్రశ్నిస్తారు. అయితే, ప‌లు ష‌ర‌తులు, సౌల‌భ్యాలు క‌ల్పించింది. కుటుంబసభ్యులు, లాయర్లు రోజుకు 30 నిమిషాల పాటు చిదంబరంను కలిసి మాట్లాడే వీలు కల్పించింది. ప్రతి 2 రోజులకు ఒక్కసారి చిదంబరం ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పరిశీలించనున్నారు.


ఇదిలాఉండ‌గా, చిదంబ‌రం అరెస్టును ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది, మాజీ కేంద్ర‌మంత్రి కపిల్ సిబల్ త‌ప్పుప‌ట్టారు. సీబీఐ అడిగిన 12 ప్రశ్నలకు గతంలోనే చిదంబరం బదులిచ్చారని.. మళ్లీ కస్టడీ అవసరం లేదని  వాదించారు. కాగా, ఆయ‌న వాద‌న‌తో  సీబీఐ ఏకీభ‌వించ‌లేదు. మరిన్ని వివరాలు తెల్సుకోవాల్సి ఉందని సీబీఐ కోర‌డంతో... కోర్టు అంగీకరించి క‌స్ట‌డీకి అవ‌కాశం క‌ల్పించింది. చిదంబరం బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: