జ్యుడీషియల్ వ్యవహారాల్లో చంద్రబాబునాయుడు ముందు జగన్మోహన్ రెడ్డి నిలబడగలరా ? అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అందరికి ఇదే విధమైన సందేహాలు మొదలయ్యాయి.  నవయుగ కంపెనీ చేపట్టిన హైడల్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. దాంతో నవయుగ కంపెనీ కోర్టుకెక్కింది. ఆ విషయంపైనే కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. అంటే నవయుగ కంపెనీ వాదనకే కోర్టు మద్దతిచ్చినట్లైంది.

 

ఇక్కడే అందరికీ జగన్ సామర్ధ్యంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పరిపాలనలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు సర్వత్రా ఆమోదం కనబడుతోంది. పాలనలో జగన్ దూకుడు వల్ల చంద్రబాబు అండ్ కో కు దిక్కులు తోచటం లేదన్నది వాస్తవమే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ మార్కు పాలనతో మంచి మార్కులే కొట్టేశారు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనకు రెండు నెలల జగన్ పాలనకు జనాలు కూడా తేడా తెలుసుకుంటున్నారు.

 

అంతా బాగానే ఉంది కానీ జ్యుడీషియల్ విషయాలకు వచ్చేసరికి జగన్ కు ఇబ్బందులు తప్పలేదు. కాంట్రాక్టులు రద్దు చేయటం, రివర్స్ టెండరింగ్ వ్యవహారాలకు వచ్చేసరికి జగన్ నిర్ణయాలకు బ్రేక పడింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా హైడల్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో హై కోర్టులో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. నవయుగ కంపెనీతో చంద్రబాబుకున్న బంధం ఎంత గట్టిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 

నవయుగ కంపెనీ కోర్టులో ఇబ్బంది పడిందంటే పరోక్షంగా చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. కాబట్టే జ్యుడిషియల్ లో తనకున్న మొత్తం పరిచయాలను ఉపయోగించైనా సరే నవయుగ కంపెనీకి చంద్రబాబు సాయం చేస్తారనటంలో సందేహం లేదు. మరి ఈ విషయాన్ని జగన్ మరచిపోయినట్లున్నారు. హైడల్ ప్రాజెక్టు వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేసి ముందు ముందు చంద్రబాబు విషయంలో జగన్ జాగ్రత్తపడకపోతే పరిపాలనలో కూడా కష్టాలు తప్పవు.


మరింత సమాచారం తెలుసుకోండి: