యాదాద్రి భువనగిరి జిల్లాలో అటవీశాఖ భూములను సమర్పించడంతో పాటు భవిష్యత్ లో అక్రమాల బారిన పడకుండా వినూత్న పద్ధతిలో అటవీ భూముల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది అటవీశాఖ. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలో తంగేడు వనాన్ని అభివృద్ధి చేసింది. దాదాపు నూట నలభై ఎకరాల్లో అరుదైన మొక్కలు పచ్చదనం పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేలా అన్ని రకాల ఏర్పాట్లతో అద్భుత వనాన్ని అభివృద్ధి పరిచారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైదరాబాద్ విజయవాడ హైవే పై ఏర్పాటు చేసిన ఈ తంగేడు వనంలో రకరకాల పూల మొక్కలు అరుదైన అటవీ జాతి మొక్కలు పెంచారు.


నెమలి లాంటి వన్యజీవులను ఇందులో స్వేచ్ఛగా తిరిగేలా అందుబాటులో ఉంచారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా ఏర్పాటు చేశారు. పర్యాటుకులకు ఆటవిడుపు కలిగేలా అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న చౌటుప్పల్ ప్రాంతంలో ఇలాంటి తంగేడు వనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఉదయం సాయంత్రం వేళల్లో కుటుంబంతో కాసేపు సేద తీరేందుకు ఎంతో బావుందని అన్ని చోట్లా అటవీ భూముల్లో ఇలాంటి వనాలను అభివృద్ధి పరిస్తే ఎంతో బావుంటుందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.దీన్ని చూడటానికి జనం వెల్లువెత్తుతున్నారు. చూసి ఆనందిస్తున్నారు. దాదాపు నాలుగు కోట్లతో అభివృద్ధి చేసిన ఈ తంగేడు వనంలో అరుదైన రకరకాల మొక్కలతో పాటు సీతాకోక చిలుక వనం, రాశీ వనం లాంటి ప్రత్యేక వనాలను ఇందులో ఏర్పాటు చేశారు. అందమైన పూలపై వాలే రంగురంగు సీతాకోక చిలుకలు చూపరులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఒక్కో రాశి వారికి ఏ రాశి వారికి ఏ మొక్క అనే అంశాలను వివరిస్తూ చేసిన రాశీ వనం ఇక్కడ ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది.


చిన్నారులకు పార్కులు, వాకర్స్ కోసం ప్రత్యేకమైన ట్రాక్స్ తో కుటుంబాలు సరదాగా గడిపేలా అందరికీ ఆహ్లాదాన్ని అందించేలా అభివృద్ధి పరిచిన ఈ తంగేడు వనం చూపరులను ఆకర్షిస్తోంది. పూర్తిస్థాయిలో ఇందులో అభివృద్ధి పనులు పూర్తయ్యాక త్వరలోనే ప్రారంభం కానుంది ఈ తంగేడు వనం. మొత్తంగా వినూత్న పద్ధతిలో అటవీ భూముల సంరక్షణతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి వనాలను ఏర్పాటు చేయడం అభినందనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: