మంచినీళ్లకు అడ్డుకట్ట వేస్తారు, మురుగునీటిని మాత్రం ఆంధ్రా భూభాగంలోకి విచ్చలవిడిగా వదిలేస్తారు. బంగారం పండుతున్న పంట పొలాల్లోకి వాళ్ళ చెత్తను డంప్ చేస్తారు. అదేంటని ప్రశ్నిస్తే అర్థం కాని భాషలో సమాధానం చెబుతారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని తెలుగు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒడిశా గజపతి జిల్లా నుంచి ఆంధ్రా గ్రామాల్లోకి వస్తున్న డ్రైనేజీతో పాటు వ్యర్థాల కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు పాతపట్నం గ్రామంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది.


ఆంధ్రా సరిహద్దు గ్రామాల ప్రజలు అంటే అక్కడి అధికారులకు చిన్నచూపులా మారింది. శ్రీకాకుళం జిల్లా పాత పట్నం నియోజక వర్గం ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు ఆనుకుని ఉంటుంది. గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకిమిడికి ఆంధ్రాలోని పాత పట్నం నియోజకవర్గానికి మధ్యలో మహేంద్రతనయ నది మాత్రమే సరిహద్దుగా ప్రవహిస్తూ ఉంటుంది. పర్లాకిమిడిలోని మురుగు నీరు చెత్తను డంప్ చేసుకోవటం కోసం వందల ఎకరాల తెలుగు రైతుల పంట పొలాలను ఒడిశా ప్రభుత్వం వాడుకుంటుంది


పర్లాకిమిడి పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ను తరలించటానికి సరిహద్దులలో పధ్ధెనిమిది వందల డెబ్బైలలో గజపతి రాజులు చెరువు తవ్వించారు. అది కాస్త కాలగర్భంలో కలిసిపోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మురుగు నీరు ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లోకి రావడం మొదలైంది. ఆ తర్వాత ఏకంగా కాలువల ద్వారా ప్రవహించడం ప్రారంభమైంది. ఒడిశా అధికారులు ఆ చెరువు ఉండే ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చటంతో సరిహద్దు రైతులకు కష్టాలు మొదలయ్యాయి.



పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని గోపాలపురం, హెచ్ గోపాలపురం, కాపు గోపాలపురం గిరిజన గ్రామాలు ఉన్నాయి. పర్లాకిమిడి పట్టణం నుంచి వచ్చే డ్రైనేజీతో పాటు క్లినికల్ వేస్టేజ్ ను ఈ గ్రామంలోని పంట పొలాల్లోకి మళ్లిస్తున్నారు. దీంతో వందలాది ఎకరాల్లోని పచ్చటి పంట పొలాలు మురుగునీటి కూపాలుగా మారిపోయాయి. కనీసం గిరిజన రైతులు తమ పొలాల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఏ రోగం వస్తుందో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి వ్యర్థాలు పంట పొలాల్లోకి వస్తుండటంతో దుర్వాసన వస్తుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: