తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలనీ టార్గెట్ చేసుకుంటూ, వారిని తమ పార్టీలోకి లాగేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలని బీజేపీలోకి తీసుకున్నారు.  అలాగే కొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు కాషాయ కండువా కప్పారు. ఇంకా నాయకులని  పార్టీలోకి తీసుకోచ్చేందుకు మంతనాలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అంతకముందు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని బీజేపీ లాగేయాలని ప్రయత్నించింది కానీ ఆమె టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో దామోదర రాజనరసింహ పై దృష్టి పెట్టి ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.     


పైగా దామోదర కుటుంబంతో బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు దామోదర కాంగ్రెస్ లో ఉన్న ఆయన భార్య పద్మిని మాత్రం బీజేపీలో చేరింది. అయితే భర్త ఒక పార్టీలో ఉండి భార్య వేరే పార్టీలో ఉంటే బాగుండదని దామోదర  భార్యని రాత్రికి రాత్రే మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేశారు. అయితే ఆదోల్ నుంచి పోటీ చేసి దామోదర ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీలో ఏదైనా సమావేశాలు జరిగిన ఆయన హాజరు కాలేదు.


ఈ క్రమంలోనే ఆయన భార్య పద్మినితో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ని కలిసారట. ఇక అప్పటి నుంచి ఆయన బీజేపీలోకి వెళ్లతారని ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు కూడా ఆయన పార్టీలోకి రావోచ్చని పరోక్షంగా ప్రకటనలు కూడా చేశారు. అయితే వీటిని దామోదర ఖండించలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన భార్యతో కాషాయ జెండా కప్పుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి భార్య వెళ్ళి తిరిగొచ్చినా బీజేపీలోకే రాజనరసింహ వెళ్లాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: