తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌. కొత్త జిల్లాలు, మండలాల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త‌ పోస్టులకు అనుమతి ఇచ్చింది.  పంచాయతీరాజ్ శాఖకు కొత్తగా 311 పోస్టులు మంజూరయ్యాయి. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.


ఇటీవ‌ల పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇవోపిఆర్డీ పోస్టులను ఇకపై మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సిఇవోలు, డిపిఓలు, సిఇవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్ చెప్పారు.


కాగా, తాజాగా మంజూరైన పోస్టుల్లో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23, డిప్యూటీ ఛీఫ్ ఎగ్జ్సిక్యూటివ్ పోస్టులు-23, జిల్లా పంచాయతీ అధికారులు-23, డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టులు- 40, మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో)-101, మండల పంచాయతీ అధికారులు-101. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని కేసీఆర్ స‌మీక్ష‌లో తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామన్నారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన  సీఎం కేసీఆర్ జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. పట్టుపట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుందన్నారు. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వర్తించామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: