విశాఖ జిల్లాలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జీవీఎంసీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా వరసగా అనేకమంది పెద్దల భవనాలను టార్గెట్ చేసింది. ఇందులో ముందుగా బలి అయింది విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే అయిన పీలా గోవింద సత్యనారాయణది. ఆయనకు విశాఖ సిటీలో ఉన్న భారీ భవంతికి నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆరోపిస్తూ తాజాగా జీవీఎంసీ అధికారులు కూల్చేసారు.


అది విశాఖతో పాటు రాష్ట్రంలోనే సెన్షేషన్ అయింది. ఇక ఇపుడు మరో ప్రముఖుడి భవనంపైన జీవీఎంసీ గురి పెట్టింది. ఆయన ఎవరో కాదు, విశాఖ జిల్లాను కొన్నేళ్ళ పాటు శాసించిన నిన్నటి మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనకు భీమిలీలో అద్దాల భవంతి ఉంది. అది కూడా జీవీఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి మరీ కట్టారని కంప్లైంట్. దాంతో దాన్ని కూల్చివేతకు జీవీఎంసీ రెడీ అయింది. ఈ రోజే ముహూర్తం కూడా పెట్టింది.


ఈ రోజు భీమిలీలో గంటా గెస్ట్ హౌస్  కూల్చడానికి అంతా రంగం సిధ్దం అయింది. అదే జరిగితే అతి పెద్ద సంచలనం అవుతుందని అంటున్నారు. నిన్నటి వరకూ గంటా ఇదే  భీమిలీలో ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేశారు. ఇపుడు ఆయన నిన్నటి మిత్రుడు అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అంతే కాదు ఆయన  ఇపుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఇపుడు మిత్రుడి ప్రభుత్వం గంటా గెస్ట్ హౌస్ ని కూలుస్తూంటే ఆ బాధ తట్టుకోవడం  ఎవరికైనా కష్టమే.


ఏది ఏమైనా నిబంధనల ప్రకారమే అంతా అంటున్నారు జీవీఎంసీ అధికారులు.  ఇప్పటివరకూ టీడీపీలో కూడా మౌనంగా ఉంటున్న గంటా తన గెస్ట్ హౌస్ మీద గునపం పడితేనైనా మౌనం వీడుతారా అన్న చర్చ సాగుతోంది. ఆయన గెస్ట్ హౌస్ మీదకే గునపం దిగితే రచ్చ రచ్చ చేస్తారా అన్న మాట కూడా వినిపిస్తోంది.  గంటా తరువాత మరెవరి భవనాలు బలి అవుతాయో చూడాల్సివుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: