మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మరీ ఇంత నీచానికి దిగజారతారా అంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు.


ఇంతకీ విషయం ఏమిటంటే.. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులం పేరిట దూషిస్తూ టీడీపీ సోషల్ మీడియా కొన్ని పోస్టులు సర్క్యులేట్ చేస్తోందట. దీనిపై విజయ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ'' అంటూ ట్విట్టర్ లో నిలదీశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు


అంతే కాదు.. ఇక, చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాదృచ్ఛికమేమీ కాదంటూ కొంత సెంటిమెంట్ యాడ్ చేశారు. అందుకు కారణం.. ఆ పాద మహిమ అలాంటిదని పేర్కొన్నారు. చిదంబరం అరెస్టు, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం వంటి ఉదంతాలను విజయ సాయి రెడ్డి ప్రస్తావించారు.


రాష్ట్ర ప్రభుత్వంలో జలవనరుల శాఖ చాలా కీలకమైంది. ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఆర్థిక శాఖ ల తర్వాత ఇదే కీలకమైన శాఖ. అందులోనూ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తున్న తరుణంలో ఈ శాఖ చాలా కీలకంగా మారింది. అలాంటి శాఖను వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తికి.. అందులోనూ యువకుడి కేటాయించడం నిజంగా జగన్ చేసిన సాహసంగానే చెప్పాలి. మరి అనిల్ ఆ పదవికి ఎంత వరకూ వన్నె తెస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: