పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ళ నిర్మాణానికి తగిన స్ధలం లేదని ఈమధ్యనే సుమారు 6 వేల నిర్మాణాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ పరిసర ప్రాంతాల్లో  లక్ష ఇళ్ళను నిర్మించాలని జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఐదేళ్ళల్లో లక్ష ఇళ్ళ నిర్మాణమంటే మామూలు విషయం కాదు. పైగా రాజధాని ప్రాంతంలో లక్ష ఇళ్ళంటే సంచలనమనే చెప్పాలి.

 

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నవరత్నాల అమలు, మద్యపాన నిషేధం లాంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే జనసామాన్యానికి ఉపయోగపడేలా  సుమారు 19 చట్టాలు కూడా చేశారు. సరే చేసిన చట్టాలన్నీ సక్రమంగా అమలవుతాయా అంటే అది వేరే సంగతి.

 

అసెంబ్లీలో చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేసే ఉద్దేశ్యంతోనే జగన్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే, నవరత్నాల హామీల అమలుకు, చట్టాల అమలుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నారు జగన్. అంటే చట్టాలు చేసి గాలికి వదిలేయటమనే విధంగా కాకుండా ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నారంటే అమలుపై చిత్తశుద్ది ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి.

 

తాజాగా లక్ష ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే వచ్చే ఉగాది పండుగ నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే.  ఇప్పటికే నిర్ణయించిన 25 లక్షల ఇళ్ళకు తాజాగా నిర్ణయించిన లక్ష ఇళ్ళు అదనమన్నమాట.

 

విజయవాడలో ఇళ్ళ నిర్మాణాలకు స్ధలం దొరకటం గగనమన్న విషయం తెలిసిందే. అందుకనే విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, జూపూడి, అంబాపురం, జక్కంపూడి, నున్న, గొల్లపూడి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్ధలాల్లో నిర్మించనున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి స్ధలం లేకపోతే ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుగోలో చేస్తారు.  వెయ్యి ఎకరాల్లో కట్టే ఇళ్ళను జి+3 పద్దతిలో నిర్మించాలని జగన్ డిసైడ్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: